BRS Meeting | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ)/ఖమ్మం/సిద్దిపేట, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రోడ్లపై లారీలను అడ్డంగా పెట్టించారు.. ట్రాఫిక్‌ను మళ్లించారు.. రోడ్లపై పలుచోట్ల నిలిచిన వాహనాలు.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ చిక్కులు.. ఇవీ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్తున్న శ్రేణులకు పోలీసుల నుంచి ఎదురైన అడ్డంకులు. ఆదివారం ఉద యం నుంచే ఎల్కతుర్తివైపు దారులన్నీ గులాబీమయం అయ్యాయి. దీంతో కాంగ్రెస్ పెద్దల గుండెల్లో గుబులు చెలరేగింది. అడుగడుగునా ‘జై కేసీఆర్.. జై బీఆర్ఎస్’ అన్న నినాదాల హోరును జీర్ణించుకోలేకపోయారు. చిన్నారుల నుంచి పెద్దల వరకూ ఊరూరా పండుగలా బీఆర్ఎస్ సభవైపు వెళ్తుండటాన్ని టీవీల్లో చూసి పోలీసులను ఉసిగొల్పారు. లక్షలాదిగా తరలివస్తున్న గులాబీ రథచక్రాలను అడ్డుకునేందుకు అధికారాన్ని ప్రయోగించారు. ఇదే అదనుగా పోలీసులు రోడ్లకు అడ్డంగా లారీల ను పెట్టించి.. ట్రాఫిక్‌ను మళ్లించారు. దీంతో లక్షలాదిమంది తరలివచ్చిన బస్సులు, లారీలు, మినీ లారీలు, ఆటోలు, కార్లలోనే ఉండిపోయారు. సభకు రాకుండానే ఆయా వాహనాల్లో ఉండే కేసీఆర్ ప్రసంగాన్ని విన్నా రు. కొన్నిచోట్ల బస్సులు, వాహనాలకు బీఆర్ఎస్ జెండాలు కట్టొద్దంటూ, స్టిక్కర్లు అంటించొద్దంటూ ఆదేశాలు జారీచేశారు. కొన్నిచోట్ల జెండాలు కట్టినందుకే కార్యకర్తలపై కేసులు పెట్టారు. సభకు వెళ్లకుండా ప్రైవేట్ వాహనాలను అడ్డుకొని, ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఖమ్మం జిల్లాలో కొన్ని ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు.
సిద్దిపేట రంగధాంపల్లి వద్ద ట్రాఫిక్ చిక్కులు
మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలతోపాటు సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వాహనాలు సిద్దిపేట మీదు గా బయలుదేరాయి. సిద్దిపేట రంగధాంపల్లి చౌరస్తా వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. హైదరాబాద్ వైపు పొన్నాల వరకు, మెదక్ రూట్లో విపంచి భవన్ వరకు, కరీంనగర్ రూట్లో నర్సాపూర్ చౌరస్తా వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫి క్ జాం పేరిట పోలీసులే దగ్గరుండి వందలాది వాహనాలను తిప్పి పంపారని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఎల్కతుర్తికి వెళ్లే 1,000కి పైగా వాహనాలను హుస్నాబాద్ దాటిన తర్వాత కొత్తపల్లి నుంచి యూటర్న్ చేసి తిరిగి సిద్దిపేట వైపు పోలీసులు మళ్లించారు. ఆర్టీవో అధికారులను అడుగడుగునా పెట్టి వాహనాలు చెక్ చేయించారు. సూల్ బస్సులు అద్దెకు ఇచ్చిన వారికి నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురిచేశారు. సిద్దిపేట ఏసీపీ మధు సిబ్బందితో ఆలస్యంగా చేరుకున్నారు. కనీసం ట్రాఫిక్‌ను క్లియర్ చేయకపోగా, హనుమకొండ రూట్లో వెళ్లాల్సిన వాహనాలను కరీంనగర్ రూట్లో ఎదురు పంపుతూ రెండు కిలోమీటర్ల దూరంలోని నర్సాపూర్ చౌరస్తా నుంచి తిరిగి వచ్చేలా ఏసీపీ మళ్లించారు. దీంతో మరింత ట్రాఫిక్ చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు వచ్చి ట్రాఫిక్‌ను స్వయంగా క్లియర్ చేసి వాహనాలు త్వరగా వెళ్లేలా చొరవ చూపారు.
ఘట్కేసర్ టోల్‌ప్లాజా వద్ద భారీగా..
ఓఆర్ఆర్పై ఘట్కేసర్ టోల్‌ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేలాది వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ వైపు నుంచి భారీ సంఖ్యలో వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల వాహనాలు ఈ ట్రాఫిక్‌లో నిలిచిపోయాయి. సిద్దిపేట ఎక్స్‌రోడ్స్ రంగధాంపల్లి వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వేలాది వాహనాలు కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయాయి. దీంతో హరీశ్‌రావు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు చొరవ తీసుకున్నారు.
వరంగల్‌కు 20 కి.మీ మేర నిలిచిన ట్రాఫిక్
వరంగల్ నగరానికి నలుదిక్కలా వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. ఒక్కసారిగా దారులన్నీ కిక్కిరిసిపోయాయి. సభా వేదికలకు కేసీఆర్ వచ్చే ముందు వరంగల్ నలువైపులా దాదాపు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది. వేలాది వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. లక్షలాది మంది ట్రాఫిక్ కారణంగా సభా వేదికకు చేరుకోలేక తమతో తెచ్చుకున్న భోజనాలు, పులిహోర, ఇతర తినుబండారాలు తిని రోడ్డుపైనే కేసీఆర్ ప్రసంగం విన్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వేదికకు 12 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. పోలీసులు లారీలు తెచ్చి అడ్డం పెట్టి మరీ.. సభవైపు వెళ్లకుండా ట్రాఫిక్‌ను మళ్లించారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేశారు.
ఖమ్మంలో ఆర్టీఏ అధికారులు,పోలీసుల అత్యుత్సాహం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులను అడ్డగించేందుకు ఆర్టీఏ అధికారులు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బీఆర్ఎస్ వాహనాలను అడుగడుగునా అడ్డుకున్నారు. కల్లూరు, తిరుమలాయపాలెం వద్ద వాహనాలను రవాణా శాఖ అధికారులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కల్లూరు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చొరవతో వాహనాలను వదిలారు. తిరుమలాయపాలెం వద్ద అనేక వాహనాలను ఆర్టీఏ అధికారులు తనిఖీల పేరిట నిలిపివేశారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితరులు చేరుకుని ఆర్టీఏ అధికారులతో వాగ్వాదానికి దిగారు. వారు దగ్గరుండి వాహనాలను పంపించారు. మరోసారి తిరుమలాయపాలెం వద్ద బస్సులను ఆపుతున్నారని తెలుసుకుని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పార్టీ శ్రేణులతో కలిసి చేరుకున్నారు. ఇబ్బందులు పెడితే ధర్నా చేస్తానని ఆర్టీఏ ఉన్నతాధికారులకు ఫోన్లో హెచ్చరించడంతో వారు వెనక్కి తగ్గగా, వాహనాలు ముందుకు కదిలాయి.
కాంగ్రెస్ దుష్టపన్నాగం: హరీశ్‌రావు
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు, కుతంత్రాలతో దుష్టపన్నాగం పన్నిందని, బీఆర్ఎస్ విజయోత్సవాన్ని అడ్డుకోలేక పోయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సర్కారు అరాచకాలను ఎండగట్టారు. సభను అడ్డుకోవడం కోసం ఆదివారం ఉదయం నుంచి కాంగ్రెస్ సర్కారు కుట్రలు పన్నిందని ధ్వజమెత్తారు. సహాయ నిరాకరణ చేసి సభను ఫెయిల్ చేసే కుట్ర చేసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పటాపంచెలు చేశారని స్పష్టంచేశారు. అడుగడుగున పోలీసుల ఆంక్షలు, నిర్బంధాలు ప్రయోగించిందని మండిపడ్డారు. రజతోత్సవ సభ అనగానే కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయని, ఈ సభలో కాంగ్రెస్ అరాచకాలను కేసీఆర్ నిలదీస్తడు అనగానే ప్రభుత్వానికి వెన్నుల్లో వణుకు పుట్టిందని పేర్కొన్నారు. సభా స్థలికి తమ పార్టీ కార్యకర్తలు చేరకుండా 10 నుంచి 15 కి.మీ మేర ట్రాఫిక్ చిక్కులు కల్పించారని దుయ్యబట్టారు. సాక్షాత్తు పోలీసులే దగ్గరుండి వందలా ది వాహనాలను వెనక్కి తిప్పి పంపారని తీవ్రంగా ఆరోపించారు. ఇది ఆరంభం మాత్ర మే అని, ప్రజలను నమ్మించి నయవంచన చేసిన తమ మోసపూరిత వైఖరికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని అన్నారు.
ఎర్రటెండలో ట్రాఫిక్ క్లియర్ చేసిన హరీశ్‌రావు
‘పోనియ్.. ముందుకుపోనియ్.. బండ్లు ఎక్కడా ఆగొద్దు.. నేరుగా సభ వద్దకే వెళ్లాలి’ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎర్రటి ఎండలో రోడ్డుపై నిలబడి వాహనదారులకు సూచిస్తూ, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఎల్కతుర్తికి వెళ్లే రహదారులపై గులాబీ శ్రేణుల వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా వాహనాల డ్రైవర్లకు తగు సూచనలు ఇవ్వసాగారు. కార్లు, బస్సుల్లో వెళ్తున్న గులాబీ శ్రేణులను హరీశ్‌రావు ఉత్సాహపరిచారు. ఆదివారం మిట్ట మధ్యాహ్నం కారు దిగి.. ఎర్రటి ఎండలో రోడ్డుపక్కన నిలబడి చేయి ఊపుతూ.. ముందుకు కదలాలని ఇలా వాహనదారులకు మార్గదర్శనం చేశారు.
అన్నా.. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాం
‘అన్నా.. కేటీఆర్ అన్నా.. హరీశ్ అన్నా.. ట్రాఫిక్‌లోనే ఇరుక్కుపోయాం. సభకు అందుకోలేకపోయాం’ అంటూ ఎంతోమంది కార్యకర్తలు, ముఖ్యనేతలు బీఆర్ఎస్ ముఖ్య నేతలకు వాట్సాప్‌లో వీడియో సందేశాలు పంపారు. ట్రాఫిక్‌ను నియంత్రించడంలో పోలీసులు ఎంత ఘోరంగా విఫలమయ్యారో వివరిస్తూ ముఖ్య నాయకులకు మెసేజ్‌లు చేశారు.