రాజన్న సిరిసిల్ల/కరీంనగర్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్న కాంగ్రెస్ సర్కార్ పోలీసులను ఎగదోసి ఉక్కుపాదం మోపుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాను అష్టదిగ్బంధం చేశారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో భారీగా బలగాలను దింపి, అర్ధరాత్రి నుంచే అరెస్టులు చేయించింది. గ్రామాలు, పట్టణాల్లోని బీఆర్ఎస్ కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు, నేత, ఆటో కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్లకు తరలించారు.
అడుగడుగునా నిర్భంధాలు, ఆంక్షలు విధించి, తనిఖీలతో హడలెత్తించారు. సీఎం పాదయాత్ర, బహిరంగసభలో ఎలాంటి నిరసనలు, ప్లకార్డులు ప్రదర్శించవద్దని హుకుం జారీచేశారు. ఎన్నడూ లేని విధంగా కార్మిక క్షేత్రం ఖాకీల బూట్ల చప్పుళ్లతో దద్దరిల్లడంతో కార్మికులు ఉలిక్కిపడ్డారు. ఎల్లారెడ్డిపేట, బోయినపల్లి, తంగళ్లపల్లి, ఇల్లంతకుంటలో పలువురిని అరెస్ట్ చేశారు. అటు కరీంనగర్ జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో బీఆర్ఎస్, సీపీఎం నాయకులను, దళితబంధు లబ్ధిదారులు, మాల మహానాడు నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధించారు. రేకుర్తిలో 22ఏ బాధితులతోపాటు కాంగ్రెస్ నేత నందెల్లి ప్రకాశ్‌ను అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది.