చెన్నూర్ టౌన్ : చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచి ( SBI Branch ) లో జరిగిన కుంభకోణం ( Scam Case ) కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు క్యాషియర్ నరిగె రవీందర్ ( Cashier Narige Ravinder ) తో సహా 44 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీడియా ఎదుట ముగ్గురు ప్రధాన నిందితులను ప్రవేశ పెట్టారు. క్యాషియర్‌తో పాటు స్కాంలో బ్యాంక్ మేనేజర్, ఎనిమిది మంది సిబ్బంది కీలక పాత్ర పోషించారు. నిందితుడి నుంచి 15.237 కిలోల బంగారు ఆభరణాలు, రూ.లక్షా 23 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా మీడియా ఎదుట హాజరుపరిచారు. రామగుండంలోని సీపీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలను సీపీ వెల్లడించారు.ఆగస్టు 23న ఎస్బీఐ చెన్నూర్ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా చెన్నూర్‌లో పీఎస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. బ్యాంకులో 402 గోల్డ్ లోన్ ఖాతాలో 25.17 కిలోల బంగారాన్ని నిలువ ఉంచిందని, వీటి విలువ రూ.12.61 కోట్లు, నగదు రూ.1.10 కోట్లు దుర్వినియోగం చేసి దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు.
కేసును చేధించడానికి నాలుగు ప్రత్యేక బృందాలను మంచిర్యాల్ డీసీపీ ఏ. భాస్కర్, పర్యవేక్షణలో ఏసీపీ జైపూర్ ఏ. వెంకటేశ్వర్‌కు అప్పగించామని వివరించారు. దర్యాప్తు అధికారి, ప్రత్యేక బృందాలు బ్యాంకును తనిఖీ చేసి, సాంకేతిక ఆధారాలను సేకరించి, క్యాషియర్ నరిగె రవీందర్ ఖాతాలో ఆడిట్ నిర్వహించగా భారీగా అనుమానాస్పద డిపాజిట్లు ఉన్నట్లు తేలిందని వివరించారు. ప్రధాన నిందితుడు క్యాషియర్ నరిగె రవీందర్ అదుపులోకి తీసుకుని ప్రశ్నించామని వెల్లడించారు.
అక్టోబర్ 2024కు ముందే ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ.40 లక్షలు పోగొట్టుకున్న క్యాషియర్ తన నష్టాన్ని పూడ్చుకునేందుకు, మరింత బెట్టింగ్ కొనసాగించేందుకు బ్రాంచ్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్‌తో కలిసి మోసానికి పాల్పడ్డాడని తెలిపారు. బ్యాంక్ కరెన్సీ, ఛెస్ట్ తాళం మేనేజర్, క్యాషియర్ సంయుక్త ఆధీనంలో ఉండాలని నిబంధనలు ఉండగా మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్ తన తాళాన్ని క్యాషియర్‌కు ఇచ్చాడని దాన్ని ఉపయోగించుకుని, నరిగె రవీందర్, క్యాషియర్, మేనేజర్ , ఔట్సోర్సింగ్ ఉద్యోగి సహకారంతో బంగారం, నగదు దొంగిలించేందుకు పథకం రచించాడని అన్నారు.
అక్టోబర్ 2024 నుంచి తరచూ గోల్డ్‌లోన్ చెస్ట్ నుంచి బంగారం తీసి, తన స్నేహితులకు అప్పగించి ఆ బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలలో తాకట్టు పెట్టి, డబ్బును తమ ఖాతాల్లో జమ చేసి, కొంత కమిషన్ తీసుకుని మిగతా మొత్తాన్ని క్యాషియర్ రవీందర్‌కు బదిలీ చేసేవారని వివరించారు. ఇప్పటివరకు నిందితులు పది ప్రైవేట్ గోల్డ్ లెండింగ్ కంపెనీలలో 44 మంది పేర్లపై 142 గోల్డ్ లోన్లు తీసుకున్నారని తెలిపారు.
క్యాషియర్ నరిగె రవీందర్ బ్రాంచ్ మేనేజర్‌తో కుమ్మక్కై తన భార్య, మరిది స్నేహితుల పేర్లతో తప్పుడు గోల్డ్లోన్లు 42 మంజూరు చేసి, బంగారం లేకుండానే రూ.1.58 కోట్లు 4.14 కిలోల బంగారం తాకట్టు పెట్టినట్లు చూపించి విత్‌డ్రా చేసుకున్నాడని అన్నారు. వాస్తవ నష్టం 21 కిలోల బంగారం విలువ ఉంటుందని చెప్పారు. క్యాషియర్ రవీందర్, ఏటీఎంలలో నగదు రీఫిల్ చేసే సమయంలో కూడా డబ్బు అపహరించేవాడని తెలిపారు. దర్యాప్తు అధికారి ఇప్పటివరకు ముగ్గురు బ్యాంకు అధికారులు, వారికి తోడ్పడిన 41 మందితో కలిపి మొత్తం 44 నిందితులను అరెస్టు చేశామని అన్నారు.
వివిధ బ్యాంకుల నుంచి 15.23 కిలోల బంగారు నగలు రికవరీ అయ్యాయని తెలిపారు. మిగతా బంగారు ఆభరణాలను రికవరీ చేయాల్సి ఉందన్నారు. గోల్డ్‌లోన్ కంపెనీ మేనేజర్ల పాత్ర పై విచారణ కొనసాగుతున్నదని తెలిపారు. ఈ కేసును తక్కువ కాలంలోనే చాకచక్యంగా ఛేదించినందుకు పోలీసు అధికారులను అభినందించారు.