కొండాపూర్/ హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్ ప్రాంతం అది.. మంగళవారం మధ్యా హ్నం 12 గంటల సమయం.. ఒక మహిళ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నది. ముగ్గురు దొంగలు బైక్‌పై వెనుక నుంచి వచ్చి ఒక్కసారిగా ఆమె మెడలోని చైన్ లాగి ఉడాయించారు. దొంగతనం చేసి వస్తున్నారన్న సమాచారంతో సీసీఎస్ పోలీసులు యాదయ్య, రాజు వారిని ఫాలో అయ్యారు. అశోక్‌నగర్‌లో ఆ దొంగలను చుట్టుముట్టారు. వెంటనే దొంగల్లో ఒకడు బొడ్లోని కత్తి తీసి యాదయ్యపై దాడికి పాల్పడ్డాడు. 7 సార్లు కత్తితో పొడిచాడు.
ఓ వైపు రక్తం చిందుతున్నా ఆ పోలీస్ మాత్రం దొంగలను ఉడుంపట్టు పట్టి అస్సలు వదల్లేదు. ఈడ్చుకొచ్చి ఆ ముగ్గురిని కటకటాల్లోకి నెట్టారు. సోమవారం ఉదయం నుంచి స్నాచర్లు మియాపూర్, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో పంజా విసిరారు. ఈ ఘటనలతో అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో రాంచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ముగ్గురు దొంగలు పట్టుబడ్డారు. వీరు కర్ణాటకలోని బీదర్‌కు చెందినవారిగా గుర్తించామని పోలీసులు తెలిపారు. గాయపడ్డ కానిస్టేబుల్ యాదయ్య ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. పోలీస్ శాఖలో ప్రతిష్ఠాత్మక అవార్డుకు యాదయ్య పేరును పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సిఫార్సు చేయనున్నారు.
నిలకడగా కానిస్టేబుల్ యాదయ్య పరిస్థితి
కానిస్టేబుల్ యాదయ్య ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నదని గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖాన వర్గాలు తెలిపాయి. దవాఖానకు తీసుకొచ్చిన సమయంలో తీవ్ర రక్తస్రావం జరిగిందని, గొంతు, ఎడమ చెయ్యి, ఎడమ ఛాతి, ఎడమ తొడ భాగంలో కత్తి పోట్లు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. శస్త్రచికిత్స పూర్తి చేసి, వెంటిలేటర్‌పై ఉంచినట్టు పేర్కొన్నారు.