హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఈ నెల 30న నిర్వహించే కానిస్టేబుల్ (సివిల్, టెక్నికల్)అభ్యర్థుల తుది రాత పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) తెలిపింది. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందే చేరుకోవాలని సూచించింది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసినట్టు వెల్లడించింది.
అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్‌పై పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో అతికించాలని సూచించింది. అభ్యర్థులెవరైనా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే.. టీఎస్ఎల్పీఆర్బీతో సహా దేశంలోని ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పరీక్షలకు కూడా నిషేధం విధిస్తామని హెచ్చరించింది. కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. మహిళా అభ్యర్థులు ఆభరణాలు ధరించొద్దని, మెహందీ, టాటూ ఉంటే పరీక్షకు అనుమతి నిరాకరిస్తామని స్పష్టంచేసింది.