HCU | హైదరాబాద్ సిటీబ్యూరో/ కొండాపూర్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సర్కారీ గూండాగిరి కొనసాగింది. హెచ్‌సీయూ క్యాంపస్‌లో భారీ గా పోలీసు బలగాలను మోహరించి, అష్టదిగ్బంధం చేసింది. విశ్వవిద్యాలయం ద్వారాలన్నింటినీ పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. మరోవైపు, భూముల వేలానికి వ్యతిరేకంగా క్యాంపస్‌లో శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. ఇంకోవైపు, అక్కడ పనులు నిలిపివేయాలంటూ హైకోర్టు స్టే విధించినప్పటికీ, కోర్టు ఆర్డర్ కాపీలు అందలేదంటూ అర్ధరాత్రి వరకూ పనులు కొనసాగించింది. మొత్తానికి బుధవారం హెచ్‌సీయూ క్యాంపస్ రణరంగాన్ని తలపించింది. 400 ఎకరాల వర్సిటీ భూముల వేలాన్ని 3వ పేజీలో
పర్యావరణాన్ని కాపాడాలంటూ ఉద్యమించిన హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థుల వీపులు పలిగాయి. పిల్లలు, ప్రొఫెసర్లు అనికూడా చూడకుండా బుధవారం పోలీసు లాఠీలు వీరంగం వేశాయి. చదువుల
తల్లి నిలయాన్ని కరకు ఖాకీబూట్లు రణరంగంగా మార్చివేశాయి.
జరిగాయని ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న పాపానికి నిరుద్యోగ నేత జనార్దన్ మాట్లాడకుండా పోలీసులు చేతులు నోరు మూశారు. ఎక్కడికక్కడ నిరుద్యోగులకు ప్రవేశం లేకుండా కట్టడి చేశారు. కనీసం సమావేశం పెట్టుకోనివ్వ కుండా వచ్చిన వారిని వచ్చినట్టే అరెస్ట్ చేశారు.
ఒక్క మాటలో చెప్పాలంటే బుధవారం హైదరాబాద్ మహానగరం అష్టదిగ్బంధానికి గురైంది. హెచ్‌సీయూ విద్యార్థులు నెక్లెస్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం దగ్గరకు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. బారికేడ్లు పెట్టేశారు. సెంట్రల్ వర్సిటీని దాదాపు ఒక చెరసాలలా మార్చేశారు. మీడియాకు కూడా అనుమతివ్వకుండా గేట్లు మూసేశారు. మరోవైపు గ్రూప్-1 అభ్యర్థులు సమావేశం అవుతారనే అనుమానంతో సిటీ సెంట్రల్ లైబ్రరీకి తాళాలు వేశారు. అశోక్‌నగర్‌కు వెళ్లే అన్ని దారులూ ఆపేశారు.
ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని అడ్డుకోవడానికి కొందరు హైకోర్టుకు వెళ్లారు. పర్యావరణాన్ని కాపాడాలని, రేవంత్ సర్కారు చేస్తున్న విధ్వంసాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూముల్లో చేపట్టిన పనులను తక్షణమే రేపటి దాకా ఆపేయాలని హైకోర్టు ఆదేశించింది. కానీ ప్రభుత్వం కోర్టు ఆర్డర్ కాపీ అందలేదని సాంకేతిక కారణాన్ని చూపుతూ సాయంత్రం దాకా చెట్ల కూల్చివేతను కొనసాగించింది. ఇప్పటికే 80 శాతం చెట్లు ధ్వంసమయ్యాయి.
హైకోర్టు మాటా వినరు.. వర్సిటీలంటే లెక్కలేదు. ప్రొఫెసర్లంటే గౌరవంలేదు. మేధావుల మాట వినేదిలేదు. పర్యావరణం అంటే ప్రేమలేదు. పిల్లల ఆవేదన అర్థం కాదు. తెలిసిందల్లా ఒక్కటే.. మొండితనం.. మంకుపట్టు. వచ్చిందల్లా ఒక్కటే విద్య.. బుల్డోజర్ భాష.. లాఠీ యాస.. ఇదీ రేవంత్ సర్కార్ తీరు.
నిలిపివేయాలని, జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ గత కొద్ది రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన బుధవారం మరింత ఉద్దృతమైంది. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో అధ్యాపకులు కూడా గొంతు కలిపారు. వర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని వేలం వేసేందుకు ప్రభుత్వం చేపట్టిన పనులను వెంటనే నిలిపివేయడంతోపాటు విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలంటూ హెచ్‌సీయూ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ఈస్ట్ క్యాంపస్ మీదుగా వర్సిటీ ప్రధాన ద్వారం వరకు, ప్రధాన ద్వారం నుంచి అడ్మినిస్ట్ట్రేషన్ భవనం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ‘పోలీస్ గో బ్యాక్’, ‘ప్రభుత్వం వెంటనే యూనివర్సిటీ స్థలాన్ని వీడాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
ఆడిటోరియం నుంచి ప్రారంభమైన ర్యాలీ.. క్యాంపస్ మెయిన్ గేటు, అడ్మినిస్ట్రేషన్ భవనం మీదుగా ఈస్ట్ క్యాంపస్ వైపు శాంతియుతంగా వెళ్తుండగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. దొరికిన విద్యార్థులను దొరికినట్టుగా చితకబాదారు. దీంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థుల వెన్నుపై, కాళ్లపై లాఠీ వాతలు పడ్డాయి. దీంతో ఆగ్రహించిన ఫ్రొఫెసర్లు, విద్యార్థులు.. పోలీస్ జులుం నశించాలంటూ రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. యూనివర్సిటీ భూములను దోచుకొనేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇలాంటి పరిస్థితులను తీసుకొచ్చారని మండిపడ్డారు. వెంటనే పోలీసులు, బుల్డోజర్లు క్యాంపస్ నుంచి బయటకు వెళ్లిపోవాలని, క్యాంపస్ భూములను యూనివర్సిటీ పేరుపై రిజ్రిస్టేషన్ చేయించాలని డిమాండ్ చేశారు.
హెచ్‌సీయూ భూములను ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే, వర్సిటీ యాజమాన్యం మాత్రం మౌనంగా ఉంటూ, ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నదని ఆరోపిస్తూ విద్యార్థులు అర్థరాత్రి వరకు అడ్మిన్రిస్టేషన్ భవనం ముందు ఆందోళన చేపట్టారు. భూముల పరిరక్షణ కోసం తమతో కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేయాలని కోరుతూ అందజేసిన మెమొరాండంపై వర్సిటీ యాజమాన్యం మౌనంగా ఉండటంతో అక్కడే బైఠాయించారు.
యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పాటలు పాడుతూ ఆందోళన కొనసాగించారు. వర్సిటీ భూములను తిరిగి అప్పగించి, యూనివర్సిటీ పేరిట రిజ్రిస్టేషన్ చేసేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. విద్యార్థులు లాఠీదెబ్బలు తింటున్నా యాజమాన్యానికి కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న తమ ఆందోళనకు యాజమాన్యం కూడా మద్దతు తెలపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మాదాపూర్ డీసీపీ వినీత్ హెచ్సీయూకు చేరుకున్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితుల గురించి పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన గేటు వద్ద నుంచే పరిస్థితిని సమీక్షించిన డీసీపీ, పోలీసులు ఎక్కడా లాఠీచార్జి చేయలేదని, కేవలం గుంపును చెదరగొట్టేందుకు యత్నించినట్టు చెప్పారు.
ఆందోళనలతో అట్టుడుకుతున్న హెచ్‌సీయూలో డ్రోన్లు ఎగురవేసిన ముగ్గురు వ్యక్తులపై గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదుచేశారు. మణికొండ ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అరుణ్‌కుమార్ (33) మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో టీఎన్జీవో కాలనీ వద్ద నుంచి దానికి ఆనుకుని ఉన్న హెచ్‌సీయూ క్యాంపస్‌పై డ్రోన్ కెమెరాను ఎగురవేశాడు. జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన సివిల్ ఇంజినీర్ సాయివిజయ్రెడ్డి మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో, బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన రోహన్ నాగిరెడ్డి మంగళవారం రాత్రి సమయంలో హెచ్‌సీయూపై డ్రోన్లు ఎగురవేయడంతో ఈ ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరికి నోటీసులు ఇచ్చి పంపించివేసినట్టు పేర్కొన్నారు.
హెచ్‌సీయూలోని ఈస్ట్ క్యాంపస్ వైపు ఉన్న 400 ఎకరాల చదును చేసే పనుల్లో ప్రభుత్వం ఒంటెద్దు పోకడ ప్రదర్శించింది. హైకోర్టుకు పండుగ సెలవులను అసరాగా చేసుకుని వందల సంఖ్యలో బుల్డోజర్లను దింపి రాత్రి, పగలు అని తేడా లేకుండా జీవ వైవిధ్యాన్ని నాశనం చేసింది. వన్యప్రాణుల ఆరణ్య రోదనలను పట్టించుకోకుండా ఫ్లడ్లైట్లను పెట్టుకొని మరీ భూములను చదును చేసింది. భూములు తమవేనని చెప్తున్న ప్రభుత్వం, 400 జేసీబీలతో రాత్రింబవళ్లు పనులు చేయించింది. ఈ నేపథ్యంలో పనులు నిలిపివేయాలంటూ బుధవారం హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం దిగొచ్చింది. తొలుత న్యాయస్థానం ఆర్డర్ కాపీ తమకు చేరలేదంటూ రాత్రి వరకు పనులు కొనసాగించింది. చివరకు పనులు నిలిపివేసింది. దాదాపు 80% మేర పనులు జరిగినట్టు విద్యార్థులు చెప్తున్నారు.
హెచ్‌సీయూ క్యాంపస్‌ను పోలీసులు బుధవారం అష్టదిగ్బంధం చేశారు. విశ్వవిద్యాలయం ద్వారాలన్నింటినీ బారికేడ్లతో మూసివేశారు. క్యాంపస్ దరిదాపులకు ఎవ్వరూ వెళ్లకుండా పోలీసు బలగాలను మోహరించారు. ఒక్కో గేటు వద్ద పదుల సంఖ్యలో పోలీసులను మోహరించి లోపలివారు బయటకు, బయటివారు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈస్ట్ క్యాంపస్ వైపు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి, అటువైపు విద్యార్థులు వెళ్లకుండా కట్టడి చేశారు.
విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలియజేసేందుకు బయటి నుంచి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఎవ్వరూ రాకుండా భారీ బలగాలను మోహరించారు. విద్యార్థులు, యూనివర్సిటీ ఉద్యోగులను మాత్రమే గుర్తింపుకార్డులు చూసి లోపలికి అనుమతించారు. హెచ్‌సీయూను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. హెచ్‌సీయూ వైపు వెళ్లే ప్రధాన రహదారుల వద్ద కూడా పోలీసులు మోహరించడంతో ఏం జరుగుతున్నదో తెలియక సాధారణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు.