మహబూబ్‌నగర్, అక్టోబర్ 29 : సోషల్ మీడియాలో బీఆర్ఎస్కు అనుకూలంగా పోస్టులు పెడుతున్నాడని ఆ పార్టీ కార్యకర్తను మహబూబ్‌నగర్ పోలీసులు బైండోవర్ చేసి చితకబాదారు. బాధితుడి కథనం మేరకు..మహబూబ్‌నగర్ వన్‌టౌన్ ప్రాంతంలో నివసించే వరద భాస్కర్ ముదిరాజ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో అతడు ఇంట్లో ఉన్న సమయంలో పోలీసులు ఇంటికి వచ్చి స్టేషన్‌కు రావాలని ఒత్తిడి చేశారు. ‘ఈ రోజు ఉపవాసం ఉన్నా.. పూజ చేశాక వస్తా అని చెప్పినా.. పోలీసులు వినలేదు. ‘ఏం తప్పు చేశాడని స్టేషన్‌కు రమ్మంటున్నారు’ అని కుటుంబసభ్యులు అడిగినా వినలేదు.
దీంతో ఆ వ్యక్తి స్టేషన్‌కు వెళ్లగానే సోషల్‌మీడియాలో పోస్టులు ఎందుకు పెడుతున్నావని సీఐ అప్పయ్య టైర్ బెల్టుతో చితకబాదారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, హరీశ్‌రావు స్టేషన్‌కు వస్తున్నారనే సమాచారం రావడంతో ఆగమేఘాల మీద అతడిని అర్బన్ తహసీల్దార్ ఎదుట హాజరుపర్చి వదిలిపెట్టారు. మరోసారి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించినట్టు బాధితుడు వాపోయా డు. ఈ విషయమై సీఐ అప్పయ్యను ప్రశ్నిస్తే ఫిర్యాదు రావడంతోనే భాస్కర్‌ను బైండోవర్ చేసినట్టు తెలిపారు. డీఎస్పీ వెంకటేశ్వర్లును వివరణ కోరగా వాట్సాప్‌లో పోస్టులు పెట్టినందుకే భాస్కర్‌ను బైండోవర్ చేశామని, అతడిపై దాడి చేయలేదని పేర్కొన్నారు.