నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మార్చి 13 (నమస్తే తెలంగాణ): పల్స్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ పీ రేవతి, న్యూస్ రిపోర్టర్ బండి సంధ్య అలియాస్ తన్వీ యాదవ్‌లను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై గురువారం వాదనలు ముగిశాయి. నిందితుల నుంచి నేరాంగీకార వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉన్నదని, వీరిపై ఉన్న ఇతర కేసుల గురించి సమాచారాన్ని సేకరించాల్సి ఉన్నదని పోలీసులు పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై అభ్యంతరకర పోస్టులు పెట్టేందుకు ప్రోత్సహించిన వారి పేర్లను ఆరా తీసేందుకు అవకాశమివ్వాలని కోరారు.
పరారీలో ఉన్న ఇతర నిందితుల వివరాలను సేకరించాల్సి ఉన్నదని తెలిపారు. వారి దగ్గర నుంచి మొబైల్ ఫోన్లను, లాప్టాప్, హార్డ్‌డిస్క్‌ల్లో నిక్షిప్తమైన వీడియోలను జప్తు చేయాల్సి ఉన్నదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రముఖులతో వీరికున్న సంబంధాలపై ఆరా తీయాల్సి ఉన్నదని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై వ్యతిరేక వార్తల్ని ప్రసారం చేసేందుకు ఎవరెవరి నుంచి పల్స్ న్యూస్ యూట్యూబ్ చానల్‌కు డబ్బులు అందుతున్నాయో తెలుసుకోవాల్సి ఉన్నదని వివరించారు.
సాక్ష్యాధారాలను జప్తు చేసేందుకు సమయం సరిపోలేదని, విచారణకు నిందితులు సహకరించకపోవడంతో బుధవారం హడావుడిగా కోర్టు ఎదుట హాజరుపర్చాల్సి వచ్చిందని తెలిపారు. నిందితుల తరఫు న్యాయవాది కిరణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ విచారణ పూర్తిచేసినట్టు అధికారులు రిపోర్టులో పేర్కొన్నారని, మహిళా జర్నలిస్టులను కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు. వాదనలు కొనసాగుతున్న సమయంలోనే మేజిస్ట్రేట్ తీర్పును 17కు రిజర్వు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. నిందితుల బెయిల్ పిటిషన్లపై సైతం తీర్పును అదేరోజు ప్రకటించనున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసు నమోదుకు సంబంధించి నిందితులకు 111 సెక్షన్ ఎలా వర్తిస్తుందో తెలపాలని, మహిళల అరెస్టులో మగ పోలీసుల తీరుపై వివరణ ఇవ్వాలని దర్యాప్తు అధికారి ఎస్ నరేశ్‌కు కోర్టు షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులకు సోమవారంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నిందితుల్ని అరెస్టు చేసినట్టు వారి కుటుంబసభ్యులకు ఎందుకు సమాచారం అందించలేదో తెలియజేయాలని సూచించింది.
ప్రశ్నించేవారి గొంతులు నొక్కడమేనా ప్రజాపాలన అంటే? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, కోవ లక్ష్మి ప్రశ్నించారు. ప్రజాసమస్యలను వెలుగులోకి తెచ్చిన రేవతి, తన్వీయాదవ్ అరెస్ట్‌ను వారు తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్‌రెడ్డి హోంమత్రిత్వశాఖను తనవద్దే పెట్టుకొని తన కనుసన్నల్లోనే జర్నలిస్టులపై దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో సీఎం సొంతూరైన కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్ట్ విజయారెడ్డి, సరితపై దాడి చేయించారని గుర్తుచేశారు. కోవ లక్ష్మి మాట్లాడుతూ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి స్పీకర్‌పై ఏం మాట్లాడారో పూర్తిగా తెలుసుకోకుండానే స్పస్పెన్షన్ వేటే వేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడని కాంగ్రెస్ సభ్యులు జగదీశ్‌పై ఒంటికాలిపై లేవడం బాధాకరమని అన్నారు.
– ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కోవ లక్ష్మి