హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): సేవల కోసం ఆశ్రమంలో చేరిన తనపై రెండేండ్లుగా స్వామిజీ లైంగికదాడి చేస్తున్నాడని ఓ అనాథ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారించిన పోలీసులు సోమవారం అర్ధరాత్రి స్వామిజీని అరెస్టు చేశారు. ఈ ఘటన ఏపీలో కలకలం రేపింది. బాధితురాలి కథనం మేరకు.. రాజమండ్రికి చెందిన ఓ అనాథ బాలిక రెండేండ్ల క్రితం విశాఖలోని కొత్త వెంకోజీపాలెంలో ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో చేరింది. ఆశ్రమ నిర్వాహకుడైన పూర్ణానంద స్వామిజీ బాలికతో ఆవులకు మేతవేయటం, పేడ తీయటం వంటి పనులు చేయించేవాడు. అర్ధరాత్రి అయ్యాక తన గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించేవాడు. ఏడాదిగా గదిలోనే కాళ్లకు గొలుసు వేసి బంధించాడు. ఎదురుతిరిగితే కొట్టేవాడు. ఆకలవుతున్నా.. రెండు చెంచాల అన్నాన్ని నీటితో కలిపి పెడుతూ హింసించేవాడు. కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోనివ్వలేదు. ఇలా రెండేండ్లుగా బాలికను చిత్రవధ చేశాడు.
దారుణం వెలుగు చూసిందిలా..
ఈ నెల 13న పనిమనిషి సాయంతో ఆశ్రమం నుంచి బాలిక తప్పించుకున్న ది. తిరుమల ఎక్స్ప్రెస్లో పరిచమైన ఓ ప్రయాణికురాలికి తన గోడు వెళ్లబోసుకున్నది. ఆమె బాలికను కృష్ణా జిల్లా కంకిపాడులోని ఓ హాస్టల్లో చేర్పించేందుకు ప్రయత్నించింది. హాస్టల్ నిర్వాహకులు పోలీస్స్టేషన్ నుంచి అనుమతి కావాలని కోరారు. పోలీసులను ఆశ్రయించిన బాలిక వారి సాయంతో బాలల సంక్షేమ కమిటీకి తను అనుభవించిన చిత్రవధ గురించి చెప్పింది. సీడబ్ల్యూసీ సభ్యులు బాలికను విజయవాడ పోలీస్ స్టేషన్కు పంపించి, పూర్ణానంద స్వామిజీపై పోక్సో కేసు పెట్టించారు. పోలీసులు స్వామిజీని అదుపులోకి తీసుకున్నారు.