హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయిన ఢిల్లీ బీజేపీ దూతలు ఆ తరువాత ఎవరెవరిని సంప్రదించారు, తమను కాపాడాలని ఎవరిని కోరారు అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మొయినాబాద్ ఫాంహౌస్‌లో స్వామీజీలు రామచంద్ర భారతి, సింహయాజి, మధ్యవర్తి నందకుమార్‌ను పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిని రిమాండ్‌కు అప్పగించేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించడంతో పోలీసులు విడిచిపెట్టారు.
ఆ రాత్రి నుంచి తిరిగి శనివారం మధ్యాహ్నం వరకు అనగా 36 గంటలపాటు వీరు ఎక్కడ ఉన్నారు? ఏం చేశారు? ఎవరితో మాట్లాడారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఏసీబీ కోర్టు నుంచి బయటకు వచ్చిన వీరు షేక్‌పేట్‌లోని ఆదిత్య హిల్‌టాప్‌లో ఉన్న నందకుమార్ ఇంట్లోనే బస చేసినట్టు తెలుస్తున్నది. ఈ 36 గంటల్లో వారు ఎవరితో మాట్లాడారు, తమ ఆపరేషన్ ఆకర్ష్ విఫలమైన సంగతిని ఎవరికి చేరవేశారు, తమను కాపాడాలని ఎవరిని కోరారు అన్న అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు తమను పంపిన ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలోని బీజేపీ పెద్దలతోపాటు స్థానిక నేతలను కూడా వీరు సంప్రదించినట్టు తెలిసింది. ఇందుకోసం వారు సిమ్ కార్డులు మార్చి ఇంటర్నెట్ ఫోన్లు, వాట్సాప్ కాల్స్‌ను ఉపయోగించినట్టు సమాచారం. దీనిపైనా పోలీసులు దృష్టి పెట్టి, వాటిని కూడా కేసు దర్యాప్తులో చేర్చేందుకు సిద్ధమవుతున్నారు.