తమ యూనివర్సిటీ భూములను కాపాడుకోవాలనుకున్న పాపానికి విద్యార్థులపై రేవంత్ సర్కారు విరుచుకుపడింది.
పండుగ పూట పోలీసులతో వీపులు పగులగొట్టించింది. వర్సిటీలో వందలాదిగా మోహరించిన పోలీసులు అడ్డువచ్చిన విద్యార్థినల్లా లాఠీలతో గొడ్డును బాదినట్టు బాదుతూ కాళ్లు, చేతులు బంధిస్తూ.. జుట్టుపట్టి జంతువుల్లా ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఠాణాలకు తరలించారు.
బట్టలు చిరిగిపోతున్నాయని ఆడపిల్లలు రోదిస్తున్నా పట్టించుకోకుండా గుంజుకెళ్లారు. దాదాపు 200 మందిని అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. ఆదివారం వర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను చదును చేసేందుకు పోలీసు పహారాలో అధికారులు పనులు మొదలు పెట్టగా అడ్డుకోబోయిన విద్యార్థులపై ఇలా కర్కశత్వాన్ని ప్రదర్శించారు.
HCU | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : ఉగాది పండుగ పూట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంలా మారింది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లో ఆదివారం వందలాదిగా మోహరించిన పోలీసులు విద్యార్థులపై లాఠీ దెబ్బలతో విరుచుకుపడి దాదాపు 200 మందిని అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పండుగ రోజు కావడంతో విద్యార్థులెవరూ బయటకు రారని, తమకు అడ్డుచెప్పేవారు ఎవరూ ఉండరని గుట్టు చప్పుడు కాకుండా టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు జేసీబీలతో పోలీసుల కాపలా నడుమ వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లోకి వచ్చారు. దట్టమైన పొదలు, చెట్లను పెకిలించసాగారు. గమనించిన కొందరు విద్యార్థులు అక్కడికి చేరుకునేసరికి పోలీసులు చుట్టుముట్టారు. దొరికినోళ్లను దొరికినట్టే బంధించి వ్యాన్లలోకి ఎక్కించే ప్రయత్నం చేశారు.
ప్రతిఘటించినవారిని లాఠీలతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తూ.. జీవవైవిధ్యానికి నష్టం కలిగించే ప్రయత్నాలు చేయవద్దని నినదిస్తూ అక్కడికి చేరకున్న విద్యార్థులపై పోలీసులు రెచ్చిపోయారు. కాళ్లు, చేతులు పట్టుకొని నేలపై ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించారు. అరెస్టులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని వర్సిటీలో పరిగెత్తిస్తూ మరీ లాఠీలతో చితకబాదారు. 200 మందికి పైగా విద్యార్థులను రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, కొల్లూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఠాణాలకు తరలించే క్రమంలో ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని అడిగినందుకు హెల్మెట్లు, ప్రొటెక్షన్ షీల్డ్‌తో విచక్షణా రహితంగా కొట్టారు. కొందరు పోలీసులు తమను బూతులు తిట్టారని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.
పోలీసుల అరాచకాన్ని ప్రశ్నించిన ఆడపిల్లలను మహిళా పోలీసులు జుట్టుపట్టుకుని నేలపై ఈడ్చుకుంటూ వ్యాను ఎక్కించారు. ఈక్రమంలో పదుల సంఖ్యలో విద్యార్థినులు గాయాలపాలయ్యారు. బట్టలు చిరిగిపోయినా పట్టించుకోకుండా విద్యార్థులను గుంజుకెళ్లారు. ఇతర రాష్ర్టాల వాళ్లు కావడంతో తెలుగు రాదని.. బూతులు తిడుతూ లాక్కెళ్లారు. గాయాలతో రక్తం కారుతున్నా పట్టించుకోకుండా వ్యాన్ ఎక్కించి ఠాణాలకు తరలించారు. అడ్డుకోబోయిన యువకులను కాళ్లు, చేతులు పట్టుకుని వ్యాన్‌లో పడేశారు. పక్క కు నిలబడ్డ కొందరు విద్యార్థులను అకారణంగా లాక్కెళ్లి వ్యాన్ ఎక్కించారు. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ తోటి విద్యార్థులు వర్సిటీ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించారు. బయటకు రాకుండా నిర్బంధించడంతో అక్కడే కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. 400 ఎకరాల భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, అరెస్ట్ చేసిన విద్యార్థులను వదిలిపెట్టేదాకా అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.
జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్న మాపై రాష్ర్టాన్ని దోచుకునే వాళ్లు దాడులు చేయడం సిగ్గుచేటు. వన్య ప్రాణులను కాపాడాల్సిన ప్రభుత్వ బాధ్యతను మాపై వేసుకుని ఉద్యమం చేస్తుంటే పోలీసులను పంపి దౌర్జన్యానికి పాల్పడుతున్నరు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48(ఏ) ప్రకారం జీవ వైవిధ్యాన్ని రక్షించడం ప్రభుత్వ బాధ్యత. అది వదిలేసి వన్యప్రాణుల ప్రాణం తీసి రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నరు. నిన్నటి నుంచి పోలీసులు యూనివర్సిటీలో మోహరించి మమ్మల్ని ఖైదీల్లా చూస్తున్నరు. ఆడ పిల్లలు అని కూడా చూడకుండా జుట్టుపట్టి లాక్కెళ్తున్నరు. బూతులు తిడుతూ దాడులు చేస్తున్నరు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా 400 ఎకరాల భూమిని, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నం. భూమి కోసం, హక్కుల కోసం పోరాటం చేయడం తెలంగాణ రక్తంలోనే ఉందనేది మర్చిపోవద్దు.
– త్రివేణి, పీహెచ్డీ స్కాలర్, జాయింట్ సెక్రటరీ, స్టూడెంట్ యూనియన్
రేవంత్‌రెడ్డి నింయంతృత్వ పరిపాలనకు హెచ్‌సీయూ విద్యార్థులపై జరిగిన దాడి నిదర్శనం. 400 ఎకరాల భూములను లాక్కోవడానికి రేవంత్‌రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా అడ్డుకుంటం. పండుగ రోజు ఎవరూ ఉండరనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కుట్రపూరితంగా మాపై దౌర్జన్యానికి పాల్పడ్డది. మమ్మల్ని దొంగల్లా, రౌడీల్లా ఈడ్చుకెళ్లారు. హాస్టళ్ల లోపలికి చొరబడి ఖైదీలను లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి అరెస్ట్ చేసిండ్రు. యూనివర్సిటీలో పోలీసులు భారీగా మోహరించడాన్ని ప్రశ్నించినందుకే మాపై దాడులకు పాల్పడ్డరు. వందలాది మంది విద్యార్థులకు గాయాలైనయి. బట్టలు చిరిగిపోయినయి. మాపై ప్రభుత్వం చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నం. వర్సిటీ పరిధి భూములను హెచ్‌సీయూ పేరిట రిజిస్ట్రేషన్ చేసేదాకా ఆందోళన విరమించేది లేదు.
– ఉమేశ్ అంబేద్కర్, స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్
కాళ్లు, చేతులు బంధించి…
చిరిగిన చొక్కాను చూసుకుంటున్న విద్యార్థి
చిరిగిన చొక్కాతో విద్యార్థి
అరెస్టు అయిన విద్యార్థులను పరామర్శించేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్
నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను లాక్కెళ్తున్న పోలీసులు
విద్యార్థులను లాక్కెళ్లి వాహనంలోకి ఎక్కిస్తున్న పోలీసులు
మాదాపూర్ ఠాణాలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన అరెస్టు అయిన విద్యార్థులు
అరెస్టులను ఖండిస్తూ వర్సిటీ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించిన విద్యార్థులు