హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): మారుతున్న సాంకేతిక పరిస్థితులను క్షుణ్ణంగా పోలీసులకు వివరించడంతోపాటు, సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలను నేర్పించడానికి తెలంగాణ పోలీసు అకాడమీ, ఐఐఐటీ హైదరాబాద్‌తో మంగళవారం ఒప్పందం చేసుకుంది. పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాషబిస్త్, ఐఐఐటీ ప్రతినిధులతో కలిసి ఎంవోయూపై సంతకం చేశారు.
ప్రైవేటు టీచర్లకు పురస్కారాలు ఇవ్వాలి
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రైవేటు టీచర్లకు పురస్కారాలు ఇవ్వాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ప్రజాభవన్‌లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని 11 వేల పైచిలుకు ప్రైవేటు స్కూళ్లలో 2.5 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ టీచర్లకు న్యాయం జరిగేటట్టు చూడాలని విద్యాశాఖ కమిషనర్ నరసింహారెడ్డికి ఫోన్లో విన్నవించినట్టు పేర్కొన్నారు.
డీఎస్సీ ‘స్పోర్ట్స్’ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి
హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ-2024 పరీక్షకు జిల్లాలవారీగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు క్రీడా ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మంగళవారం ప్రకటనలో సూచించారు. నేటి నుంచి 2 వరకు అఫిషియల్ వెబ్సైట్ ద్వారా స్పోర్ట్స్ సర్టిఫికెట్లను సమర్పించాలని కోరారు.
5లోగా ‘మేనేజ్మెంట్’ వివరాలు వెల్లడించండి
బీఈ/బీటెక్ కోర్సుల్లో ఈ ఏడాది మేనేజ్మెంట్ కోటా సీట్ల వివరాలను 5లోగా వెల్లడించాలని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ యాజమన్యాలకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ సూచించారు. అప్లోడ్ చేసిన వివరాలను ఫ్రీజ్ చేయడానికి వచ్చే నెల 5 చివరి గడవు అని తెలిపారు. రూ. వెయ్యి అపరాధ రుసుముతో 10 వరకు అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. www. tgche. ac.in ను చూడాలని కోరారు.