హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): కావాలనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటనతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టంచేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారికి లీగల్ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు. మొయినాబాద్ మండ లం, తోలట్టలోని తన భూమిలో బుధవారం ఎవరో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారని మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో జరుగుతున్న దుష్ప్రచారంపై గురువారం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు.
‘నేను 2018లో తోలట్ట గ్రామంలో భూమి కొనుగోలు చేశా. ఆ ప్రాపర్టీని నా మేనల్లుడు జ్ఞాన్దేవ్రెడ్డి చూసుకుంటున్నాడు. అందులో ఫార్మ్‌హౌస్ లేదు. తోటలు, పనిచేసేవారికి రెండు గదులు మాత్రమే ఉన్నాయి. నా ప్రమేయం లేకుండా సదరు తోటను వర్రా రమేశ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తికి జ్ఞాన్దేవ్రెడ్డి కౌలుకు ఇచ్చినట్టు తెలిసింది. తన ఆధీనంలో ఉన్న ఆ తోటను రమేశ్‌కుమార్‌రెడ్డి, ఎం వెంకటపతిరాజుకు కౌలుకు ఇచ్చినట్టు తెలిసింది.
సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నిన్ననే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను’ అని పేర్కొన్నారు. ‘మీడియాలో వార్తలు వస్తున్నట్టు ఆ తోటలో ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగి ఉంటే వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు నేను హైదరాబాద్‌లో లేను. రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికే కొందరు నాపై దుష్ప్రచారం మొదలుపెట్టారు’ అని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.