హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : పీఎం యశస్వి (పీఎం – యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డు ఫర్ వైబ్రెంట్ ఇండియా) స్కాలర్షిప్ పరీక్ష దక్షిణాది విద్యార్థులకు ప్రతిబంధకంగా మారింది. కేంద్రప్రభుత్వం ఈ పరీక్షను కేవలం హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే నిర్వహించడంపై ప్రాంతీయ భాషల్లో చదివే విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది. ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ పరీక్షను రెండు భాషల్లో నిర్వహిస్తే.. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లల్లోని విద్యార్థులే స్కాలర్షిప్ను కైవసం చేసుకొంటారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. కేంద్రం అన్ని పరీక్షల మాదిరిగానే పీఎం యశస్విని కూడా ప్రాంతీయ భాషల్లోనే నిర్వహించాలని వారు కోరుతున్నారు.
జేఈఈ, నీట్లకు లేనిది..
ప్రాంతీయ భాషల్లోనే విద్యాబోధన కొనసాగాలని జాతీయ నూతన విద్యావిధానం (ఎన్ఈపీ) గతంలోనే ప్రకటించింది. జేఈఈ మెయిన్, నీట్ వంటి జాతీయ ప్రవేశ పరీక్షలను కూడా ప్రాంతీయభాషల్లో నిర్వహిస్తున్నారు. ఇటీవలే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను కూడా ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని ఐఐటీ కౌన్సిల్ ప్రాతిపాదించింది. అయితే, పీఎం యశస్వి స్కాలర్షిప్ పరీక్ష మాత్రం హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఆగస్టు 8 వరకు దరఖాస్తులు
దేశవ్యాప్తంగా పీఎం యశస్వి పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తున్నది. ఆగస్టు 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 29న పరీక్ష నిర్వహిస్తారు. మెరిట్ సాధించిన విద్యార్థులకు 9, 10 తరగతుల్లో ఏడాదికి రూ. 75వేలు, 11, 12 తరగతుల వారికి ఏడాదికి రూ.1.25లక్షల చొప్పున ఉపకారవేతనం ఇస్తారు. జాతీయంగా 15 వేల మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లను అందజేస్తారు.