Runa Mafi | హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఎన్నికలకు ముందు రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ ఆశపెట్టిన కాంగ్రెస్ పార్టీ తీరా అధికారంలోకి వచ్చాక కొందరికే పరిమితం చేస్తున్నది. అప్పుడు ఎలాంటి ఆంక్షలు పెట్టబోమని చెప్పి.. ఇప్పుడు ఎడాపెడ కోతలు పెడుతున్నది. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలే ఇందుకు నిదర్శనం. రుణమాఫీకి కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్‌కార్డును లింకు చేయడం, పీఎం కిసాన్ నిబంధనలను అమలు చేస్తామని పేర్కొనడం కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమనే విమర్శలొస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తమను తీవ్రంగా మోసం చేసిందనే ఆగ్రహం రైతుల్లో వ్యక్తమవుతున్నది. రుణమాఫీలో పేర్కొన్న పలు నిబంధనలు రైతులను ఇబ్బంది పెట్టేలా ఉండటమే ఇందుకు కారణం. నిజానికి రుణమాఫీలో ఆంక్షలు పెట్టాలని ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయించింది. పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తారంటూ నెల రోజుల క్రితమే తమ అనుకూల మీడియాకు లీకులు అందించారు. ఇప్పుడు ఆ ప్రకారమే ఆంక్షలు పెట్టి రుణమాఫీ అమలు చేస్తున్నది. తద్వారా మమ అనిపించి ప్రభుత్వంపై భారం పడకుండా, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామంటూ ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నదనే విమర్శలొస్తున్నాయి.
కోతలు పెట్టి.. ఆర్థిక భారం తప్పించుకునేలా..
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీకి దాదాపు రూ.40 వేల కోట్ల వరకు నిధులు అవసరమవుతాయనే అంచనాలున్నాయి. అది కూడా ఆగస్టు 15లోపు ఒకే విడతలో మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో అంత భారీ మొత్తం నిధులు సమకూరడం అసాధ్యంగా మారింది. దీంతో ప్రభుత్వం కోతలపై దృష్టి పెట్టిందనే విమర్శలొస్తున్నాయి. ఆర్థిక భారాన్ని తప్పించుకునేందుకు ఎక్కడ కోతలు పెట్టాలనేదానిపై కసరత్తు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. రుణమాఫీకి రూ.31వేల కోట్లు అవసరం అవుతాయని చెప్పారు. ఆ నిధులు కూడా సమీకరించే సత్తా లేకపోవడంతో మరింత మందికి కోతలేస్తున్నారని, రేషన్‌కార్డు లింకు, పీఎం కిసాన్ నిబంధనలను అమలు చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఈ రెండు నిబంధనలతో రుణమాఫీ అర్హుల సంఖ్య సగానికి సగం తగ్గిపోతుంది. అప్పుడు ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా సగానికి సగం తగ్గిపోతుంది.