మేడి విక్రమ్‌కుమార్ బాగా చదువుకొని తన కల నెరవేర్చుకోవాలనుకున్నాడు. ఎంతో కష్టపడి చదివి తన కష్టానికి ఫలితం కోసం ఎదురుచూశాడు. నీట్లో ర్యాంకు రావడంతో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. కానీ, ఆ కుటుంబానిది కూలి పనులు చేస్తేనే పూట గడిచే పరిస్థితి. కళాశాలలో అడ్మిషన్‌కు అవసరమైన ఆర్థిక స్థోమత వారికి లేదు. దాంతో అతను దిక్కుతోచని స్థితిలో సాయం కోసం ఎదురు చూస్తున్నాడు.
కట్టంగూర్, ఆగస్టు 27 : నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన మేడి రామలింగయ్య-భాగ్యమ్మ దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు.కూలి పనులు చేస్తూ ఉన్నంతలో ఇద్దరినీ చదివించారు. ఇటీవలే బిడ్డ పెండ్లి చేశారు. కొడుకు విక్రమ్‌కుమార్ 10వ తరగతి నకిరేకల్ ప్రభుత్వ పాఠశాలలో చదివి 9.5 గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించాడు. భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి 966 మార్కులతో కళాశాల ఫస్ట్ ర్యాంకులో పాసయ్యాడు.
అనంతరం హైదరాబాద్‌లోని గౌలిదొడ్డి గురుకులంలో నీట్లో శిక్షణ తీసుకుని 408 మార్కులతో 2లక్షల ర్యాంక్ సాధించి మొదటి ఫేజ్ కౌన్సెలింగ్‌లో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని భాస్కర్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందాడు. రెక్కాడితేనే డొక్కాడని కుటుంబంలో పుట్టిన విక్రమ్‌కుమార్ అడ్మిషన్ ఫీజు రూ.1.10లక్షలు, యూనివర్సిటీ ఫీజు రూ.12 వేలు, హాస్టల్ ఫీజు 1.20 లక్షలు కట్టలేని పరిస్థితి. దీంతో ఉన్నత చదువుకు దూరమవుతున్నాడు. ప్రతిభ గల ఈ సరస్వతీ పుత్రుడిని ఆదుకునేందుకు సహృదయులు సాయమందించాలని విద్యార్థి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సాయం అందించేవారు విక్రమ్‌కుమార్ ఎస్బీఐ ఖాతా నెం.42002001920, సీఐఎఫ్ నెం. 91223753192, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్ 0008807కు ఆర్థిక సాయం అందించాలని విక్రమ్‌కుమార్ కోరుతున్నాడు. సాయం చేయాలనుకునే దాతలు 9849742712కు ఫోన్ చేయాలని విద్యార్థి తల్లిండ్రులు కోరుతున్నారు.