హైదరాబాద్, మే 22(నమస్తే తెలంగాణ): మత్స్య సహకార సొసైటీల చైర్మన్‌గా పిట్టల రవీందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మాసబ్‌ట్యాంక్‌లోని మత్స్య భవన్లో పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాశ్ సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మత్స్యరంగం ఎంతో అభివృద్ధి సాధించిందని, మత్స్యకారులంతా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయల వ్యయంతో అన్ని నీటి వనరుల్లో చేప పిల్లలను విడుదల చేస్తున్నట్టు చెప్పారు.
మత్స్యరంగంపై ఎంతో అనుభవం ఉన్న పిట్టల రవీందర్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో ఈ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పిట్టల రవీందర్ మాట్లాడుతూ.. చైర్మన్‌గా తనను నియమించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. సొసైటీల చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పిట్టల రవీందర్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కూడా అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పాడి కౌశిక్ రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, కార్పొరేషన్ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, కోలేటి దామోదర్ గుప్తా, గెల్లు శ్రీనివాస్ యాదవ్, అల్లం నారాయణ తదితరులు పాల్గొన్నారు.