హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దుచేసి, పాత పెన్షన్ స్కీం(ఓపీఎస్)ను పునరుద్ధరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ సాధనకు అన్ని రాష్ర్టాల్లోని ఉపాధ్యాయ సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ (ఏఐఎఫ్‌టీవో) జాతీయ కార్యవర్గ సమావేశం జార్ఖండ్‌లోని దేవఘడ్లో నిర్వహించారు.
సమావేశానికి రాష్ట్రం నుంచి శ్రీపాల్‌రెడ్డితోపాటు పీఆర్టీయూ టీ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి, ఏఐఎఫ్‌టీవో బాధ్యులు గీత, త్రివేణి, విజయలక్ష్మి పాల్గొన్నారు. శ్రీపాల్‌రెడ్డి మట్లాడుతూ.. రాష్ట్రంలో టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని జిల్లాల టీచర్లను సమైక్యం చేస్తున్నామని, శానన మండలిలోనూ టీచర్ల సమస్యలను లేవనెత్తేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని వెల్లడించారు. టీచర్ల సమస్యల పరిష్కారంలో మెతక వైఖరి, రాజీ ధోరణి అనుసరించబోమని స్పష్టంచేశారు.