హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రవీంద్రభారతిలో శనివారం డాక్యుమెంటరీ దర్శకుడు దూలం సత్యనారాయణ ‘మేడారం, జోడేఘాట్, సోమశిల-నల్లమల ఫారెస్ట్’పై రూపొందించిన టూరిజం ప్రచార వీడియోలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పర్యాటక ప్రదేశాల్లో సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. నల్గొండ జిల్లాలోని దేవరకొండ కోటను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని, ఇప్పటికే రూ.10 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టామని చెప్పారు. దేవరకొండ కోటపై రూపొందించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌తో కలిసి మంత్రి శనివారం ప్రారంభించారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు యూనిస్ ఫర్హాన్, దేవరకొండ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది.