హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): రోగుల భద్రతను పరిరక్షించడంలో ‘ఫార్మాకోవిజిలెన్స్’ అనే వ్యవస్థ అత్యంత కీలకమైనదని నిమ్స్ సంచాలకులు డాక్టర్ రాహుల్ దేవరాజ్ అన్నారు. నిమ్స్ క్లినికల్ ఫార్మాకాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘ప్రస్తుత ఫార్మాకోవిజిలెన్స్ ధోరణులు, కృత్రిమ మేధస్సు, రియల్-వరల్డ్ డాటా, రెగ్యులేటరీ అప్డేట్స్’ అనే అంశంపై శనివారం దవాఖానలోని ఎమర్జెన్సీ బ్లాక్లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్, సీడీఎస్ సీవో జాయింట్ డ్రగ్స్ కంట్రోలర్ (ఇండియా) డాక్టర్ ఆర్ చంద్రశేఖర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రాహుల్ మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు (ఏఐ), రియల్-వరల్డ్ డాటా వంటి ఆధునిక సాంకేతికతలను సమర్థంగా వినియోగించడం ద్వారా ఔషధాల దుష్ప్రభావాలను వేగంగా గుర్తించి, మరింత నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించేందుకు వీలవుతుందని చెప్పారు.