రంగారెడ్డి, ఏప్రిల్ 4 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డిజిల్లా యాచారం మండలంలోని ఫార్మా భూముల రీసర్వే ఆందోళనల మధ్య కొనసాగుతున్నది. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను రీసర్వే చేసి కంచె వేయటానికి రెవెన్యూ, పోలీసు అధికారులు గురువారం మేడిపల్లిలో పనులు ప్రారంభించగా రైతులు అడ్డుకున్నారు. రైతులను వారికి మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టుచేసి యథావిధిగా కంచె పనులు చేపట్టారు. శుక్రవారం నాలుగు బృందాలు ఓవైపు సర్వే చేస్తుండగానే మరోవైపు కంచె వేసే పనులు చేపడుతున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బృందాలను మోహరించారు. పోలీసు పహారా మధ్య మేడిపల్లిలో రెండోరోజు కంచెవేసే పనులు కొనసాగుతున్నాయి. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు 121 గజాల ఇంటిస్థలం, ఇంటికో ఉద్యోగాన్ని ఇస్తామని చెప్పిన ప్రభుత్వం హీమీ ఇచ్చి ఇప్పుడు వాటి ఊసెత్తటంలేదు. దీంతో రీసర్వేను రైతులు అడ్డుకుని, తమ సమస్య పరిష్కరించాలని అధికారులను నిలదీశారు.
మొండిగౌరెల్లి ఉదంతం మరువకముందే ఫార్మా రీసర్వే..
యాచారం మండలంలోని మొండిగౌరెల్లిలో ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు పేరుతో 821ఎకరాలను తీసుకోవాలనే ఉదేశ్యంతో నోటిఫికేషన్ జారీచేసింది. తమ భూములు తీసుకోవద్దంటూ మొండిగౌరెల్లి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ ఉదంతం కొనసాగుతుండగానే మరోవైపు ఫార్మాసిటీ భూముల రీసర్వే కంచె వేసే పనులు మొదలయ్యాయి. దీంతో యాచారం మండలం హాట్ టాపిక్‌గా మారింది. ఫార్మా బాధిత గ్రామాలు నాలుగు ఉండగా….ముందుగా మేడిపల్లిలో రీసర్వే పనులను చేపట్టారు. నానక్‌నగర్, కుర్మిద్ద, తాటిపర్తి గ్రామాల్లో రీసర్వే ప్రారంభించాల్సి ఉంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, బీఆర్ఎస్ ఫార్మా రైతులకు బాసటగా నిలుస్తామని ప్రకటించారు.