హైదరాబాద్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం(పీజీటీఎస్ఈయూ) ఒకదానికే ఏ-గ్రేడ్‌తో కూడిన ఐకార్ గుర్తింపు ఉందని వీసీ ప్రొఫెసర్ ఆలాస్ జానయ్య స్పష్టంచేశారు. గుర్తింపులేని ప్రైవేటు కళాశాలలతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సీట్లు ఇప్పిస్తామని ప్రచారం చేసుకునే దళారుల మాటలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నమ్మి మోసపోవద్దని సూచించారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక కోటాలో ఫీజులు భారీగా తగ్గించడమే కాకుండా.. సీట్లు కూడా పెంచామని, ప్రతిభ ఆధారంగానే పీజీటీఎస్ఈయూ రెగ్యులర్, ప్రత్యేక కోటాలో ప్రవేశాలు ఉంటాయని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఆన్లైన్లో దరఖాస్తులు నవంబర్ 1 వరకు స్వీకరిస్తున్నామని, ఆసక్తి కలిగిన విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రవేశాల సమాచారం కొరకు అధికారిక వెబ్సైట్ www.pjtsau.edu.inను మాత్రమే చూడవలసిందిగా వైస్ చాన్స్‌లర్ జానయ్య తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 31న దీపావళి పండుగ సందర్భంగా స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖుల మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీడీపీ రద్దు చేసింది. 30న (బుధవారం) తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించరు. విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తిచేసింది.