హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఖైదీ నంబర్ 7691ను కేటాయించారు. చంద్రబాబును 5 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. మరో కేసులో కూడా చంద్రబాబుపై సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పీటీ వారెంట్ పిటిషన్ వేసింది. కాగా, చంద్రబాబును జైల్లో కాకుండా గృహ నిర్భందంలో ఉంచేందుకు అనుమతించాలని ఆయన తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుకు జైల్లో ప్రమాదం పొంచి ఉన్నదని, అందువల్ల గృహ నిర్భంధంలో ఉంచాలని ఆయన తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుథ్రా కోరారు. ఈ వాదనను ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. చంద్రబాబు ఇంట్లోకంటే జైలులోనే సురక్షితంగా ఉంటారని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. హౌజ్ అరెస్ట్‌కు అనుమతిస్తే కేసును చంద్రబాబు ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. సీఆర్పీసీలో హౌజ్ అరెస్ట్ అనేదే లేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు.