హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి (ఆసిఫాబాద్) ఎన్నికను సవాల్ చేస్తూ ఆమె ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యాం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. నిబంధనల ప్రకారం ఎన్నికల అఫిడవిట్లో అభ్యర్థులు వరుసగా ఐదేండ్ల ఆదాయ పన్ను (ఐటీ) వివరాలను పొందుపర్చాలని, కానీ.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోవా లక్ష్మి 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ వివరాలను మాత్రమే సమర్పించాలని అజ్మీరా శ్యాం తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మి ఎన్నికను రద్దు చేసి తాను గెలిచినట్టు ప్రకటించాలని కోరారు.
దీనిపై ఈ నెల 1, 14, 16న విచారణ జరిపిన జస్టిస్ కే లక్ష్మణ్.. శుక్రవారం తన తీర్పును వెలువరించారు. రూల్స్ ప్రకారం లక్ష్మి తన ఆదాయం, పాన్ నంబర్, ఆస్తులు, అప్పుల వివరాలతోపాటు భర్త ఆదాయాన్ని కూడా ఎన్నికల అఫిడవిట్లో పొందుపర్చారని, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కేసులో సుప్రీంకోర్టు పేరొన్న విధంగా ఆమె నామినేషన్ పత్రాన్ని సమర్పించారని పేర్కొంటూ.. పిటిషనర్ వాదనను తోసిపుచ్చారు. కేవలం ఒక్క ఏడాదికి సంబంధించిన ఐటీ రిటర్నులను మాత్రమే సమర్పించారన్న కారణంతో ఆమె ఎన్నిక చెల్లదని ప్రకటించలేమని తేల్చిచెప్తూ.. అజ్మీరా శ్యాం పిటిషన్ను డిస్మిస్ చేశారు.
ఎమ్మెల్యే లక్ష్మిపై ఎలక్షన్ పిటిషన్ దాఖలైన 9 నెలల 20 రోజులకే ఈ తీర్పు వెలువడటం విశేషం. ఫలితంగా హైకోర్టు చరిత్రలో అత్యంత త్వరగా వెలువడిన తీర్పుగా ఇది రికార్డులకు ఎక్కింది. దీంతో ఈ పిటిషన్పై విచారణ త్వరగా ముగిసేందుకు సహకరించిన వాదప్రతివాదుల తరఫు న్యాయవాదులకు జస్టిస్ కే లక్ష్మణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వాస్తవానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎలక్షన్ పిటిషన్లను 6 నెలల వ్యవధిలోగా పరిష్కరించాలి. కానీ, గతంలో ఇలాంటి పిటిషన్లపై సదరు చట్టసభ సభ్యుల పదవీ కాలం ముగిశాక తీర్పులు వచ్చేవి. కోర్టుల్లో కేసుల సంఖ్య భారీగా పెరగడం వల్ల ఎలక్షన్ పిటిషన్లపై తీర్పులు రావడంలో విపరీతమైన జాప్యం జరిగేది.