మహబూబ్‌నగర్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇటీవల జరిగిన మద్యం టెండర్లో (Liquor Tender) పాల్గొని లక్కీడిప్‌లో వైన్స్ షాపు (Wine Shop) దక్కించుకొన్న పీఈటీ పుష్పను సస్పెండ్ చేస్తూ శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ‘మద్యం వ్యాపారంలో ఉపాధ్యాయిని.. విద్యా శాఖలో మద్యం కిక్కు’ అన్న శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో రెండు రోజులుగా వస్తున్న వరుస కథనాలకు కలెక్టర్ విజయేందిరబోయి స్పందించారు.
ఇటీవల పాలమూరు జిల్లాలో ఎక్సైజ్ శాఖ నిర్వహించిన మద్యం టెండర్లలో 16వ నెంబర్ షాపునకు పాలమూరులోని రాంనగర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పీఈటీ పుష్ప రూ.3 లక్షల ధరావతు చెల్లించి టెండర్ దాఖలుచేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన లక్కీడీప్‌లో ఆమెకు అదృష్టం వరించి వైన్‌షాప్ దక్కింది.
గత నెల 28న ఇన్‌స్టాల్‌మెంట్‌కు సంబంధించి రూ.11 లక్షల ఫీజు చెల్లించగా ఆమెకు లైసెన్స్ హోల్డర్‌గా ఉత్తర్వులు అందించారు. ఈ వ్యవహారంపై కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు. సీసీఎస్ సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగి లిక్కర్ టెండర్లలో పాల్గొనడంతో డీఈవో సస్పెండ్ చేశారు. వైన్ షాపు లైసెన్స్ మాత్రం ఇంకా ఆమె పేరు మీదనే ఉన్నట్టు తెలిసింది.