Gurukula PET Recruitmentహైదరాబాద్, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ): ఉద్యోగాల కోసం ఏడేండ్లుగా ఎదురుచూస్తున్న గురుకుల పీఈటీ అభ్యర్థుల భవిష్యత్తు రోజురోజుకు అయోమయంలో పడుతున్నది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముగిసినప్పటికీ తుది ఫలితాలు ఇవ్వడంలో టీజీపీఎస్సీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇటు ఉద్యోగ తుది ఫలితాలు రాక, అటు వేరే ఉద్యోగ అవకాశాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నట్టు బాధిత అభ్యర్థులు వా పోతున్నారు. సీఎం కేసీఆర్ హయాంలో సంక్షేమ శాఖ గురుకులాల్లో 616 పీఈటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్‌తో పాటు డిగ్రీ(డిప్లొమా ప్లస్ బీపీఈడీ) వంటి విద్యార్థులు ఉండాలని నిర్ణయించారు. 16,000 మంది పరీక్షలకు హాజరయ్యారు. 1:2 నిష్పత్తి ప్రకారం ఫలితాలు విడుదల చే శారు. 2018 మే 10న 1,232మందిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచారు. 600మందికి వెరిఫికేషన్ కూడా ముగిసింది. అయితే ఇక్కడే అసలు సమస్య తెరపైకి వచ్చింది.
పీఈటీ పోస్టుల భర్తీ అంశంపై డిప్లొమా అ భ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తామే అర్హులమంటూ కోర్టు నుంచి స్టే తెచ్చారు. దీంతో 2018 మే 20న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను టీజీపీఎస్సీ అర్థాంతరం గా నిలిపివేసింది. ప్రభుత్వం, బీపీఈడీ అభ్యర్థులు హై కోర్టులో కేసు వేశారు. గత ఏడాది ఫిబ్రవరి 12న అం దరికీ న్యాయం చేయాలని హైకోర్టు స్పష్టంచేసింది. అ లాగే ఎంపికైన వారికి కూడా రెండు వారాల్లో పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. దీంతో మే 24 మళ్లీ జీఆర్ఎల్ విడుదల చేశారు. 1:2 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను పిలిచారు. మే 29 నుం చి జూన్ 4 వరకు 1,185 మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. అయితే కొందరు వేరే ఉద్యోగాలకు వెళ్లిపోవడంతో చాలా మంది డ్రాప్ అయ్యారు. దీంతో ఆ కింద ఉన్న అభ్యర్థులకు అంటే మరోసారి జూలై 4 నుంచి 11వరకు 1,086 మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేశారు. అయితే తుది ఫలితాలు మాత్రం ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.