హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. 96.50 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వీ వెంకటరమణ, శాతవాహన యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్ మల్లేశ్, కన్వీనర్ ప్రొఫెసర్ రాజేష్‌కుమార్ ఈ ఫలితాలను విడుదల చేశారు. బీపీఈడీలో 1,153, డీపీఈడీలో 554 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఫలితాలను పరిశీలిస్తే సీట్లు ఎక్కువగా, క్వాలిఫై అయిన వారి సంఖ్య తక్కువగా ఉన్నది. రాష్ట్రంలో 16 బీపీఈడీ కాలేజీల్లో 1,660 సీట్లు ఉండగా, నాలుగు డీపీఈడీ కాలేజీల్లో 350 సీట్లున్నాయి. బీపీఈడీలో 1,153 మంది మాత్రమే అర్హత సాధించగా, క్వాలిఫై అయిన వారందరికీ సీట్లు దక్కే అవకాశాలున్నాయి. కొంతకాలంగా బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సులపై విద్యార్థులకు ఆసక్తి తగ్గుతున్నది.