హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మాజీ ఏఈ పూల రమేశ్‌తో బేరాలు కుదుర్చుకొని పరీక్షలు రాసిన ఒక్కొక్కరిని సిట్ అరెస్టు చేస్తున్నది. తాజాగా నాగరాజు అనే వ్యక్తిని అరెస్టు చేసింది. గతంలోనే అరెస్టయిన గుగులోత్ శ్రీనునాయక్ ద్వారా రమేశ్‌కు నాగరాజు పరిచయమయ్యాడు. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్ ద్వారా ఏఈ పేపర్ తెప్పించుకున్న రమేశ్.. దానిని బహిరంగ మార్కెట్లో ఒక్కొక్కరికి రూ.30 లక్షలకు బేరం పెట్టాడు. అప్పటికే మాస్ కాపీయింగ్‌లో పలువురితో ఒప్పందం కుదుర్చుకున్న రమేశ్.. లీకైన పేపర్‌ను అమ్మేందుకు మాస్‌కాపీయింగ్ నెట్‌వర్క్‌ను వాడుకున్నాడు. అందులో భాగంగా నాగరాజుకు ఏఈ ప్రశ్నపత్రం అమ్మేశాడు. ఈ పరీక్షలో నాగరాజుకు 16వ ర్యాంకు వచ్చింది. అన్ని కోణాల్లో సిట్ వివరాలు సేకరిస్తూ, ఈ లింక్‌లను బయటకు తీస్తున్నది. దర్యాప్తులో పక్కా ఆధారాలు లభించడంతో నిందితులను అరెస్టు చేస్తున్నది.
ఖైదీల్లో సత్ప్రవర్తనకు త్రైపాక్షిక ఒప్పందం
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 9: ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావడం, మానసికంగా వారిని మరింత శ్రేష్ఠులుగా తీర్చిదిద్దేందుకు ఉస్మానియా యూనివర్సిటీ, పోలీసు పరిశోధన అభివృద్ధి బ్యూరో, ఢిల్లీ జైళ్ల శాఖల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఉన్నతి ప్రాజెక్ట్ డైరెక్టర్, ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ బినా సమక్షంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారి అనుపమ నీలేఖర్ చంద్ర, ఢిల్లీ జైళ్ల శాఖ అధికారి హెచ్‌పీఎస్ శ్రాన్, ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఖైదీల్లో నేరప్రవృత్తి, అపరాధ భావనను తగ్గించేవిధంగా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ విజ్ఞప్తి మేరకు ప్రొఫెసర్ బీనా 2015లో ఉన్నతి పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. దీని ద్వారా ఖైదీల్లో నేరప్రవృత్తి తగ్గించడమే కాకుండా, మానసికంగా వారు ఉన్నతి స్థితికి చేరుకొన్నట్టు రుజువైంది. దీంతో తీహార్ జైలులో ఖైదీల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకొన్నారు.