ఆసిఫాబాద్ టౌన్, జూన్ 3 : పోడు భూములు సాగు చేస్తున్న రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు బనాయించి వేధింపులకు పాల్పడితే సహించేది లేదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హెచ్చరించారు. మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట అటవీశాఖ అధికారుల వేధింపులకు నిరసనగా ఆదిమ గిరిజన భూ రక్షణ పోరాట కమిటీ, రాజ్‌గోండ్ సేవాసమితి, గోండ్వానా పంచాయతీ రాయిసెంటర్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షకు ఎమ్మెల్యే మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని, జిల్లా అటవీశాఖ అధికారులు ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి పనులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆదివాసీ గ్రామాలకు రోడ్లు నిర్మించేందుకు అధికారులు అనుమతి ఇవ్వాలన్నారు.