హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఏపీలోని కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి భార్య ఉమామహేశ్వరమ్మకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. హైదరాబాద్ అమీన్‌పూర్‌లోని తన ఫాంహౌస్ చుట్టూ తాత్కాలికంగా ప్రహరీ గోడను నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చేలా మున్సిపాలిటీకి ఉత్తర్వులు జారీ చేయాలన్న ఆమె విన్నపాన్ని జస్టిస్ కే లక్ష్మణ్ తోసిపుచ్చారు. శాశ్వత నిర్మాణాలతోపాటు ప్రహరీ గోడ లాంటి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టేందుకైనా మున్సిపాలిటీ నుంచి విధిగా అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా నిర్మించిన ప్రహరీ గోడను కూల్చేశారంటూ కోర్టుకు వస్తే జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పారు. ముందుగా మున్సిపాలిటీకి దరఖాస్తు చేసుకోవాలని, అనుమతి లభిస్తేనే ప్రహరీ గోడ నిర్మాణ పనులను చేపట్టాలని పిటిషనర్‌కు సూచించారు. అమీన్పూర్ సరస్సు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు చెప్తున్న వ్యవసాయ భూమిలో ఉమామహేశ్వరమ్మ నిర్మించిన షెడ్లను ఇటీవల హైడ్రా కూల్చివేయడంతో ఆమె ఈ పిటిషన్ దాఖలు చేశారు.
కుమ్మరివాడిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలి
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లోని కుమ్మరివాడిలో అక్రమ నిర్మాణాలను పరిశీలించాలని హైకోర్టు జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది. ఆ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలపై 4 వారాల్లోగా చర్యలు చేపట్టడంతోపాటు సంబంధిత నివేదికను హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్ట్రార్‌కు అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. పూర్వీకుల నుంచి వచ్చిన 426 చదరపు గజాల స్థలంలో నిర్మాణాలు చేపట్టడంపై జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ మహ్మద్ అబ్దుల్ ముబీన్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. కుమ్మరివాడిలో 350కిపైగా అనధికార నిర్మాణాలు ఉన్నాయని, వాటిపై ఫిర్యాదు చేసినా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే, కార్పొరేటర్ సైతం ఎలాంటి అనుమతుల్లేకుండా భవనాలను నిర్మించుకున్నారని, వాటిపై అధికారులు స్పందించకుండా పిటిషనర్‌కు షోకాజ్ నోటీసు ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు. దీంతో కుమ్మరివాడిలో అక్రమ నిర్మాణాలు పరిశీలించాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు.