KTR | కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. వికారాబాద్ జిల్లా నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాబోయే పది పదిహేను రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఆరు జడ్పీటీసీలు ఉన్నాయని.. గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇస్తామన్నారు. టికెట్ ఎవరికి వచ్చిన అందరూ కలిసికట్టుగా పనిచేసే గులాబీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్కు అనుకూలమైన వాతావరణం ఉందని.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్నారు.
బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఐకమత్యంతో పని చేయాలని.. లేకుంటే నష్టపోతామన్నారు. మెతుకు ఆనంద్ కూడా అసంతృప్తులను దగ్గర తీసుకోవాలని.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల గుండెల్లో ఉందన్నారు. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు, తొమ్మిది మంది బీజేపీ ఎంపీలు తెలంగాణకు తెచ్చింది గుండు సున్నా అని విమర్శించారు. వికారాబాద్ నియోజకవర్గంలోని ఆరు మండలాలు, ఒక మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరేసి మన సత్తా చూపించాలన్నారు. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని గెలుపు గుర్రాలకు టికెట్ ఇచ్చేలా మెతుకు ఆనంద్ చూడాలన్నారు. అసంతృప్తులను బుజ్జగించాలని.. ప్రత్యేకంగా అబ్జర్వర్లను పంపి స్థానిక పరిస్థితులను బీఆర్ఎస్ కేంద్ర నాయకత్వం సమీక్షిస్తుందన్నారు. వికారాబాద్ జిల్లా పరిషత్, వికారాబాద్‌లోని అన్ని మండల పరిషత్‌లపై గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు.