హైదరాబాద్, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ): బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సహకారంతో వివేకానంద విదేశీ విద్యా పథకం కింద విదేశీ చదువులకు వెళ్లిన పేద బ్రాహ్మణ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యకలాపాలు నిలిచిపోవడం, విదేశీ యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులకు అందజేయాల్సిన సాయాన్ని ప్రభుత్వం విడుదల చేయకపోవడమే ఈ దుస్థితికి కారణం. అక్కడ చదువులు కొనసాగించలేక, చదువులు మధ్యలో మానేసి స్వదేశానికి తిరిగి రాలేక, ఒకవేళ వచ్చినా ఇప్పటికే చేసిన అప్పులు, వాటి వడ్డీలు ఎలా తీర్చాలో తోచక సతమతమవుతున్నారు. వివేకానంద విదేశీ విద్యా పథకం కింద 2023-24 విద్యా సంవత్సరంలో 280 మంది విదేశీ విద్యాలయాల్లో ప్రవేశాలు పొందారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వారికి నిధుల చెల్లింపు నిలిచిపోయింది. అనంతరం రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రె స్ ప్రభుత్వం ఇంతవరకూ ఆ బకాయిలను చెల్లించలేదు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా తమ ఫీజులు రీయింబర్స్ అవుతాయనే ఉద్దేశంతో చాలామంది అప్పులుచేసి విదేశాల్లో అడ్మిషన్లు పొందారు. ఫీజులు రీయింబర్స్ రాకపోవడంతో అప్పులు తీర్చేదారిలేక తలలు ప ట్టుకుంటున్నారు. పలువురు విద్యార్థులు స్వదేశానికి తిరిగొచ్చి ఉన్న ఆస్తులను అమ్మి బాకీలు తీర్చుకుందామనే యోచనలో ఉన్నట్టు సమాచారం. వారి తల్లిదండ్రులు ప్రతిరోజూ బ్రాహ్మ ణ పరిషత్ కార్యాలయం చుట్టూ తిరుగుతు న్నా ఫలితం లేదు. విదేశాల్లో ఉన్న 280 మం దికి ఫీజు రీయింబర్స్ చేయాలంటే సుమారు రూ.50 కోట్లు అవసరమవుతాయని అధికారవర్గాలు తెలిపాయి. 2024-25 విద్యా సంవత్సరానికి మరో 200 మంది విద్యార్థులను ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసినప్పటికీ వారికి మంజూరు పత్రాలు జారీ చేయలేదు.
‘బెస్ట్’ అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరం
బ్రాహ్మిణ్ ఆంత్రప్రెన్యూర్షిప్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ(బెస్ట్) పథకం అభ్యర్థులు సైతం ప్రభుత్వ నిధుల కోసం వేయికండ్లతో ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలనాటికే 400 మందిని ఈ పథకం కింద ఎంపికచేయగా, మరో 1,500 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నా యి. కనీసం ఎంపికైన అభ్యర్థులకైనా నిధులు విడుదల చేస్తే వారు ఏదో ఒక వ్యాపారం చేసుకొని సొంతకాళ్లపై నిలబడే వీలు కలుగుతుంది. బెస్ట్ పథకం కింద నిధులు వస్తాయన్న ఆశతో ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వ్యాపారాలు ప్రారంభించిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వడ్డీల భారం పడుతున్నది. ఈ పథకం కింద ఇప్పటికే ఎంపికచేసినవారికి నిధులు చెల్లించాలంటే రూ.20 కోట్లు కావాలని అధికారులు చెప్తున్నారు.