హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : ‘పెండింగ్ డీఏలను తక్షణమే మంజూరుచేస్తాం. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తాం’ అంటూ హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు ఉద్యోగులకు హ్యాండిచ్చింది. కరువుభత్యం(డీఏ) విడుదలను పూర్తిగా విస్మరించింది. ఇప్పటి వరకు రెండు డీఏలు ఇవ్వగా, జూలై 1తో మరో డీఏ సర్కారు బాకీపడనున్నది. దీంతో పెండింగ్ డీఏల సంఖ్య మళ్లీ ఐదుకు చేరాయి. రాష్ట్రంలో 3.6లక్షల ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీరే కాకుండా మరో 2.88లక్షల పెన్షనర్లున్నారు. ఐదు డీఏలు పెండింగ్లో ఉండటంతో ఉద్యోగులు నెలకు రూ. 15-20వేల వరకు నష్టపోతున్నారు. దేశంలో తెలంగాణ మినహా మరే రాష్ట్రంలోనూ ఐదు డీఏలు పెండింగ్లో లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రెండు డీఏలు మాత్రమే విడుదల చేసింది. అది ఉద్యోగ సంఘాలు ఉద్యమం చేస్తామనడంతో మొదట ఒక డీఏ ఇచ్చి ఇటీవల మరో డీఏ విడుదల చేసింది. మరో డీఏను ఆరు నెలల తర్వాత ఇస్తామన్నది. ఆరు నెలల తర్వాత అంటే జనవరిలో ఇంకో డీఏ ఇస్తారు. లెక్క ప్రకారం సహజంగానే 2026 జనవరిలో మరో డీఏ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ ఆరు నెలల తర్వాత ఒక డీఏను సర్కారు విడుదల చేస్తే పెండింగ్ డీఏల సంఖ్య మళ్లీ ఐదుకు చేరుతుంది. అంటే ఒకటి ఇచ్చి, ఎప్పుడు ఐదు డీఏలను పెండింగ్లో పెట్టేలా సర్కారు తీరు కనిపిస్తున్నది.
ఎరియర్స్ కూడా పెండింగే..
ఇప్పటి వరకు విడుదల చేసిన రెండు డీఏలు పాతవే. మొదటిది 2022 జూలైది. రెండో డీఏ 2023 జనవరికి చెందినది. డీఏలతోపాటు డీఏ ఎరియర్స్ కూడా పెండింగ్లోనే ఉండటం గమనార్హం. 2022 జూలై డీఏ 17 సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు రెండు వాయిదాలు మాత్రమే చెల్లించారు. ఏప్రిల్ నుంచి నాలుగు నెలలుగా ఎరియర్స్ పెండింగ్లో ఉన్నాయి. ఎరియర్స్ బిల్లులు చేసినా మంజూరుకావడంలేదు. ఉద్యోగుల అకౌంట్లలో జమకావడం లేదు. ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత కూడా ఎరియర్స్ పెండింగ్లోనే ఉండటం దారుణం. జూలై 1న పడే వేతనంలో రెండో డీఏ కలవాల్సి ఉంది. వీటి ఎరియర్స్ జమచేస్తారా..? లేక పెండింగ్లో పెడతారా..? అన్న అనుమానాలు ఉద్యోగులను పట్టిపీడిస్తున్నాయి.
బిల్లులు కూడా బాకీయే..
ఉద్యోగుల బిల్లులను కూడా సర్కారు బాకీపడింది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఒక్క సప్లిమెంటరీ బిల్లు పాస్కాలేదు. జీపీఎఫ్ పార్ట్ఫైనల్ బిల్లులు నెలలకొద్దీ పెండింగ్లోనే ఉన్నాయి. టీజీఎల్ఐ లోన్స్, మెచ్యూరిటీ మొత్తానిది అదే పరిస్థితి. జీపీఎఫ్ లోన్ బిల్లు సమర్పించిన వారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. జీపీఎఫ్ లోన్కోసం దరఖాస్తు చేస్తే ఖాతా నుంచి లోన్ మొత్తాన్ని తగ్గిస్తున్నారు. కానీ సదరు ఉద్యోగి ఖాతాలో జమకావడంలేదు. దీంతో ఆయా మొత్తంపై వచ్చే వడ్డీ తగ్గిపోతున్నది. అటూ లోన్ రాక, ఇటూ వడ్డీ జమకాక ఉద్యోగుల అవస్థలు వర్ణణాతీతంగా మారాయి.