హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్‌లు చేస్తున్నట్టు ట్రాఫిక్ పోలీసులు తాజా చలానాల్లో వెల్లడైంది. నామినేషన్ దాఖలుకు ముందు అభ్యర్థులు ప్రభుత్వ అన్ని బకాయిలను చెల్లించాలి. ట్రాఫిక్ చలాన్లు సైతం అభ్యర్థులు క్లియర్‌చేశారు. కానీ, ప్రచారంలో భాగంగా అభ్యర్థుల కార్లు అనధికార పార్కింగ్, రాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, స్టాప్‌లైన్ క్రాసింగులకు పాల్పడ్డాయని ట్రాఫిక్ పోలీసుల రికార్డులు చెప్తున్నాయి.
ఇలా అభ్యర్థుల పేరున పెండింగ్ చలాన్లు ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్, బీఆర్ఎస్ అభ్యర్థి వీ సునీతారెడ్డి, బీజేపీ అభ్యర్థి ఎన్ రామచందర్‌రావు, ఎంఐఎం అభ్యర్థి మీర్ జుల్ఫీకర్ అలీ కార్లకు ట్రాఫిక్ చలానాలు పెండింగులో ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ బీజేపీ అభ్యర్థి దినేశ్‌కుమార్ నాలుగు కార్లపై అత్యధికంగా చాలాన్లు ఉన్నాయి. ఆయన రూ.12 వేల జరిమానా చెల్లించాల్సి ఉన్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలు అనే తేడా లేకుండా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన అందరికీ తాము చలాన్లు వేస్తున్నట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.