పీర్జాదిగూడ, జూలై 12: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్ కే జానకి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. కార్పొరేషన్లో శానిటరీ వస్తువులు సబ్బులు, నూనెలు, గ్లౌసెస్, చెప్పులు సప్లయ్ చేసే కాంట్రాక్టర్ ఎన్ శ్రీరాములుకు పెండింగ్ బిల్లులకు సంబంధించి చెక్కులను కొన్ని నెలలుగా ఇవ్వకుండా ఇబ్బందిపెట్టిన జానకి ఆయన నుంచి రూ.20 వేలు డిమాండ్ చేశారు.
దీంతో బాధిత కాంట్రాక్టర్ హైదరాబాద్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. మున్సిపల్ ఆఫీసులో బాధితుడి నుంచి డబ్బులు మొదట తీసుకున్న అసిస్టెంట్ సరోజ (అవుట్ సోర్సింగ్ ఉద్యోగి) వాటిని ఇన్స్పెక్టర్ జానకికి ఇచ్చారు. ఏసీబీ అధికారుల బృందం వెంటనే దాడి చేసి డబ్బు స్వాధీనం చేసుకున్నారు. జానకి, సరోజను అరెస్టు చేసి అవినీతి నిరోధక శాఖ కోర్టుకు తరలించినట్టు పోలీస్‌లు తెలిపారు.