నల్లబెల్లి, జనవరి 22: గ్రామ సభలు పెద్ద మాయ అని, ఎన్నికల స్టంట్ కోసమే రేవంత్ సర్కారు కుటిల యత్నం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు పోలీసు నిర్బంధాల మధ్య గ్రామసభలు నిర్వహించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. నల్లబెల్లి మండల కేంద్రంలో బుధవారం పోలీస్ కమిషనర్ మినహా వరంగల్ జిల్లా పోలీస్ యంత్రాంగం మధ్య గ్రామసభ నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపారు.
మండల కేంద్రంలో జరిగే గ్రామసభకు యోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నాయకులను రావాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పిలుపునివ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రెండు రోజుల గ్రామ సభల్లో ప్రతి గ్రామంలో రైతుబంధు, రేషన్‌కార్డులు, రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై నాయకులు, అధికారులను నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేక ప్రతి గ్రామ సభకు పోలీసులను మోహరించి ప్రశ్నించిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తాను మంజూరు చేసిన వందల కోట్ల నిధుల పనులను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రద్దుచేశారని, కేవలం లాభం వచ్చే పనులకు మళ్లీ టెండర్లు వేసి ఆయనే సొంతంగా నిర్వహిస్తూ లాభార్జనే ధ్యేయంగా సాగుతున్నారని ఆరోపించారు. గ్రామసభను కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తంచేయడం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనన్నారు. పోలీసులపై రాజ్యాంగం, చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోనని హెచ్చరించారు.