పెబ్బేరు, జనవరి 30 : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో మరో వైద్య విద్యార్థిని ప్రజాసేవకు ముందుకొచ్చారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏటిగడ్డ శాఖాపురం సర్పంచ్ స్థానానికి నిఖిత అనే ఎంబీబీఎస్ విద్యార్థిని పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. అదే బాటలో ఇప్పుడు పురపాలిక ఎన్నికల్లో మరో వైద్య విద్యార్థిని రంగంలోకి దిగారు. పెబ్బేరు మున్సిపాలిటీలో కౌన్సిలర్ పదవికి పవిత్ర అనే వైద్య విద్యార్థిని శుక్రవారం నామినేషన్ వేశారు.
ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయిన 4వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆమె వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నది. రాజకీయాలపై ఉన్న ఆసక్తి మేరకు నామినేషన్ వేసినట్టు ఆమె చెప్పారు. తనపై, తన తండ్రి మహేశ్‌పై ఉన్న నమ్మకంతో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పార్టీ టికెట్ ఖరారు చేసి ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.