హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తరచూ నేరాలకు పాల్పడేవారిపై, కరుడుగట్టిన నేరప్రవృత్తి ఉన్నవారిపై పీడీయాక్ట్ నమోదు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను హోంమంత్రి మహమూద్‌అలీ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నేరాల అదుపు, కేసుల దర్యాప్తుపై మంగళవారం లక్డీకపూల్‌లోని తన కార్యాలయం లో డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి, హోంశాఖ ముఖ్యకార్యద ర్శి రవిగుప్తా, పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు తీసుకుంటున్న చర్యలు, షీటీమ్స్ బృందాలు, డయల్-100, తదితర విద్యాసంస్థలు, పనిప్రదేశాల్లో ప్రచారం నిర్వహించాలని హోంమంత్రి సూచించారు. పౌరుల భద్రత కోసం అందుబాటులోకి తెచ్చిన టెక్నాలజీ, మొబైల్యాప్స్పై, సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోకుండా అవగాహన పెంచాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నవరాత్రులు, నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిసేందుకు తీసుకున్న చర్యలు విజయవంతం కావడంపై హోంమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. తగిన ఏర్పాట్లు చేసినందుకు డీజీపీ మహేందర్‌రెడ్డిని, పోలీస్ సిబ్బందిని అభినందించారు.