హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): టీవీవీపీ దవాఖానల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, ఇప్పటికైనా వేతనాలు చెల్లించకుంటే విధులను బహిష్కరించడానికి కూడా వెనుకాడబోమని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వరర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహ హెచ్చరించారు. ఏరియా దవాఖానలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ కార్మికులు మంగళవారం దవాఖానల ఎదుట గంటపాటు ధర్నా నిర్వహించారు. తమకు ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని టీవీవీపీ దవాఖానల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ కింగ్ కోఠిలో జరిగిన ధర్నాలో నరసింహ పాల్గొని మాట్లాడారు.
కొన్ని దవాఖానల్లో నాలుగు నెలలుగా, మరికొన్ని దవాఖానల్లో ఆరు నెలలుగా సిబ్బందికి జీతాలు అందలేదని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి టీవీవీపీ దవాఖానలకు ప్రభుత్వం బిల్లులు విడుదల చేయలేదని చెప్పారు. జీతాలు అందక కార్మికులు అవస్థలు పడుతున్నారని, వారి కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీవీవీపీ కమిషనర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేసినా స్పందన రావడం లేదని తెలిపారు. ప్రభుత్వం ఒకవైపు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని చెప్తున్నా, కార్మికులు ఆరేడు నెలలుగా పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొన్నదన్నారు. ప్రస్తుత సీజనల్ వ్యాధులు, వర్షాలను దృష్టిలో పెట్టుకొని గంటపాటు మాత్రమే ధర్నాలు చేస్తున్నామని, సమస్య పరిష్కారం కాకపోతే విధులనే బహిష్కరిస్తామని హెచ్చరించారు.
దవాఖానల నిర్వహణను గాలికొదిలిన సర్కారు: హరీశ్‌రావు
దవాఖానల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. విషజ్వరాలు విజృంభించి రోగులతో దవాఖానలు కికిరిసిపోతున్నా, నిధులు విడుదల చేయకుండా చోద్యం చూస్తున్నదని ధ్వజమెత్తారు. టీవీవీపీ దవాఖానల్లోని శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే వారికి పెండింగ్ వేతనాలను చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్టు చెప్పుకునే ముఖ్యమంత్రికి వీరి వెతలు కనిపించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. సిబ్బంది ఎన్నిసార్లు నిరసనలు తెలిపినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని, వారి గోడును పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీతాలు చెల్లించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.