మణికొండ,నవంబర్ 23: జనవాసాల మధ్య ఏర్పాటు చేసిన రెడీమిక్స్ కాంక్రీట్ (ఆర్ఎంసీ) ప్లాంట్లతో నిత్యం వెలువడే దుమ్ము, ధూళి, శబ్దంతో ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంపై రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, బీజేప్టీ నాయకుడు తోకల శ్రీనివాస్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని మైహోం అవతార్, హాల్‌మార్క్ విసినియా అపార్టుమెంట్ల మధ్య వాసవి బిల్డర్స్ సంస్థ ఏర్పాటు చేసిన ఆర్ఎంసీ ప్లాంట్‌తో తమ ఆరోగ్యాలు క్షీణించి పోతున్నాయంటూ అపార్ట్మెంట్ల వాసులు ఆయా శాఖల అధికారులకు విన్నవించినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
వారి సమస్యలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన వరుస కథనాలతో స్థానికులంతా ఏకమై శనివారం రెండు అపార్ట్మెంట్ల నివాసితుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 200 మంది అపార్ట్మెంట్ల వాసులతోపాటు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీగా మణికొండ మున్సిపాలిటీ అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించాలని తలపెట్టిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి, బీజేపీ ఇన్చార్జి తోకల శ్రీనివాస్‌రెడ్డి అక్కడకు చేరుకుని స్థానికులతో కలిసి నిరసన కార్యక్రమానికి మద్దతు పలికారు.
స్థానికుల నరకయాతన
వాసవీ అట్లాంటిస్ జనవాసాల మధ్య ఏర్పాటు చేసిన ఆర్ఎంసీ ప్లాంట్‌ను తక్షణమే మూసివేయాలంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆందోళన ఉధృతం చేశారు. ఈ ప్లాంట్ వల్ల పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే నరకయాతన పడుతున్నారని, దుమ్మూ, ధూళి, శబ్దంతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోయారు. స్థానిక రహదారులన్నీ దుమ్ముతో నిండిపోతున్నాయని, ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నా అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
శాంతియుత వాతావరణంలో తమ గోడును ప్రభుత్వానికి విన్నవించాలని నిరసన చేపడితే పోలీసులు అడ్డుకుని భయాందోళనలకు గురిచేస్తున్నారని నివాసితులు ఆరోపించారు. ఆర్ఎంసీ ప్లాంటును మూసివేయాలని 11 నెలలుగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే ప్లాంట్‌ను మూసివేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు సీతారాం ధూళిపాళ, నరేందర్, ఉపేంద్రనాథ్‌రెడ్డి, అందె లక్ష్మణ్‌రావు, కీర్తిలతాగౌడ్, రూపారెడ్డి, ప్రియాంక, ధన్‌రాజ్, ఆనంద్, ఫారూఖ్, నాగరాజు, బీజేపీ నేతలు వేణుకుమార్, భిక్షపతియాదవ్, లక్ష్మీనారాయణ, పద్మారెడ్డి, మైహోం అవతార్, హాల్‌మార్క్ విసినియా నివాసితులు పాల్గొన్నారు.
ప్లాంట్‌ను మూసివేయకుంటే 10 వేలమందితో ధర్నా
ఆర్ఎంసీ ప్లాంట్ కారణంగా మైహోం అవతార్, హాల్‌మార్క్ విసినియా, జయభేరి పీక్ లాంటి ప్రాంతాలల్లో ఐదు నిమిషాలు బయట కూర్చుంటే దుమ్ము, ధూళి పేరుకుపోతున్నదని కార్తీక్‌రెడ్డి పేర్కొన్నారు. పీసీబీ నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటైన ప్లాంట్ గండిపేట మండలంలో ఎక్కడా ఉండడానికి వీల్లేదని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే 10 వేలమందితో నిరసన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆధారాలు చూపుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చర్యలు తీసుకోకుంటే పరిణామలు తీవ్రం
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంసీ ప్లాంట్లపై చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోదండరెడ్డి హెచ్చరించారు. మైహోం అవతార్, హాల్‌మార్క్ విసినియా నివాసితులు నిరసన చేపట్టిన విషయం తెలుసుకుని అక్కడికొచ్చిన ఆయన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జనవాసాలు, వ్యవసాయ క్షేత్రాల మధ్యలో రెడీమిక్స్ ప్లాంట్లను ఏర్పాటు చేయకూడదని స్పష్టమైన నిబంధనలున్నా, వాటిని తుంగలో తొక్కిన వాసవి నిర్మాణరంగ సంస్థపై తక్షణమే కేసులు నమోదు చేయాలని డిమాండ్‌చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు ఫోన్‌చేసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆర్ఎంసీ ప్లాంట్లను తక్షణమే మూసివేసేలా చర్యలకు ఆదేశించాలని కోరారు. లేదంటే తీవ్ర పరిణామలు ఉంటాయని కోదండరెడ్డి హెచ్చరించారు.
అఖిలపక్షంగా ఏర్పాటై ఉద్యమిస్తాం
మణికొండ మున్సిపాలిటీలో ఆర్ఎంసీ ప్లాంట్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైతే అఖిలపక్షంగా ఏర్పాటై ఉద్యమిస్తామని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి తోకల శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. ప్లాంట్లను తక్షణమే మూసివేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.