హైదరాబాద్, సిటీబ్యూరో, మార్చ్ 27(నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్‌కు చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన అనుచరులు, వివిధ క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి. పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 25న రాజమండ్రి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతదేహానికి రాజమండ్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం గురువారం తెల్లవారుజామున సికింద్రాబాద్ నేరేడ్మెట్లోని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం ప్రజల సందర్శనార్థం గురువారం ఉదయం పదిగంటల నుంచి సికింద్రాబాద్‌లోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఆయనను కడసారి చూసేందుకు వేలాదిగా క్రైస్తవులు, పాస్టర్లు, అభిమానులు వివిధ ప్రాంతాలనుంచి సికింద్రాబాద్ చర్చ్ వద్దకు చేరుకున్నారు. ప్రవీణ్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాలు, పాస్టర్లు తరలివచ్చారు. ప్రజాశాంతిపార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, బ్రదర్ అనిల్‌తో సహా పలువురు ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకులు నివాళులర్పించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రవీణ అంతిమయాత్ర ప్రారంభమైంది. సాయంత్రం 4.30 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లోని సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ ప్రొటెస్టెంట్ సిమెట్రీలో ఆయన భౌతిక కాయాన్ని సమాధి చేశారు.