హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాల పేరుతో తెలంగాణ నుంచి యువతను కంబోడియాకు పంపి, సైబర్ నేరస్థులకు అప్పగిస్తున్న మహ్మద్ షాదాబ్ ఆలం అనే పాస్‌పోర్టు ఏజెంట్‌ను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. బీహార్‌కు చెందిన అతను దుబాయ్ నుంచి వస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయెల్ వెల్లడించారు.
తన కుమారుడిని అక్రమంగా కంబోడియాకు పంపినట్టు మే 16న సిరిసిల్లకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో షాదాబ్ ఆలంను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ వ్యవహారంలో జగిత్యాలకు చెందిన కే సాయిప్రసాద్, పుణెకు చెందిన మహ్మద్ అబీద్ హుస్సేన్ అన్సారీ పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించామని, వీరిద్దరూ గతంలో కూడా ఇలాంటి కేసులో అరెస్టయ్యారని వివరించారు. ఉపాధి నిమిత్తం ఎవరైనా విదేశాలకు వెళ్లాలనుకుంటే తప్పనిసరిగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోను సంప్రదించాలని శిఖాగోయెల్ సూచించారు.