వేములవాడ రూరల్/ కరీంనగర్ తెలంగాణచౌక్/హనుమకొండ చౌరస్తా/కృష్ణకాలనీ/వరంగల్ చౌరస్తా, నవంబర్ 19 : కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల నుంచి 156 పల్లెవెలుగు బస్సులు, వరంగల్ రీజియన్ పరిధిలోని అన్ని బస్సులను వరంగల్ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన సీఎం రేవంత్ సభకు కేటాయించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కరీంనగర్, వరంగల్ రీజియన్లలోని ఆయా బస్టాండ్లలో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో బస్సులు లేక ఆరు గంటలపాటు బస్టాండ్లో వేచిచూడాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు రోడ్డుపై అందోళన వ్యక్తం చేశారు. తిప్పాపూర్ బ్రిడ్జిపై గంటపాటు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ప్రయాణికులను చెల్లాచెదురు చేయడంతో వారు ఎదురుతిరిగారు. ఓటు వేసి గెలిపిస్తే రేవంత్డ్ తమకు బస్సులు లేకుండా చేసి ఇబ్బంది పెడుతున్నాడని మండిపడ్డారు.