హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వమేమో కంటిన్యుయేషన్ ఆర్డర్లు ఇవ్వకుండా నెలల తరబడి మీనమేషాలు లెక్కిస్తున్నది. ఆర్డర్ లేకుంటే జీతాలు ఇచ్చేది లేదని ఆర్థికశాఖ తెగేసి చెబుతున్నది. వెరసి రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్థిక శాఖకు మధ్యన ఔట్సోర్సింగ్, పార్ట్‌టైమ్ ఉద్యోగులు నలిగిపోతున్నారు. దీర్ఘకాలం నుంచి వేతనాలు అందక ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతున్నారు. కుటుంబాలను పోషించుకోలేక ఉద్యోగాలనే వదిలేస్తున్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల సొసైటీల్లో కాంట్రాక్టు, పార్ట్‌టైమ్, ఔట్సోర్సింగ్, హానరోరియం పద్ధతిలో వేల మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు. వారిలో బోధనా ప్రిన్సిపాళ్లు, జూనియర్ లెక్చరర్లు (జేఎల్), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల (పీజీటీ) లాంటి బోధనా (టీచింగ్) సిబ్బందితోపాటు బోధనేతర (నాన్-టీచింగ్) విభాగంలో డ్రైవర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు. వారి సర్వీసును ఏటా జూన్ నుంచి ఏప్రిల్ వరకు 11నెలల కాలానికి రెన్యువల్ చేయడం పరిపాటి. కానీ, కాంగ్రెస్ సర్కారు ఈ ఏడాది ఇప్పటివరకు ఆ ఉద్యోగుల సర్వీసును కంటిన్యూ చేస్తూ ఉత్తర్వులను వెలువరించలేదు. దీనిపై ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేయడంతో ఎట్టకేలకు ఇటీవల మైనార్టీ, ఎస్సీ గురుకుల సొసైటీల్లోని పార్ట్‌టైమ్ ఉద్యోగుల సర్వీసు రెన్యువల్‌కు కంటిన్యుయేషన్ ఆర్డర్‌ను జారీ చేసింది. కానీ, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీతోపాటు పలు ఇతర శాఖల్లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసు కంటిన్యుయేషన్ కోసం ఇప్పటికీ ఉత్తర్వులు జారీ చేయలేదు.
వేతన చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ను తీసుకొచ్చింది. పార్ట్‌టైమ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను కూడా దీని ద్వారానే అందజేస్తున్నది. ఈ వేతనాలను చెల్లించాలంటే ప్రభుత్వం ఔట్సోర్సింగ్ పోస్టులను మంజూరు చేస్తూ జారీచేసిన జీవోలను, కంటిన్యుయేషన్ ఆర్డర్లను నిర్దేశిత నమూనాలో ఆ సిస్టమ్‌లో పొందుపరచాల్సిందే. అప్పుడుగానీ ఆర్థిక శాఖ వేతనాలను చెల్లించడం లేదు. లేదంటే వేతనాలను నిలిపివేస్తున్నది.
ఆర్డర్లు లేవనే సాకుతోనే ఎస్సీ గురుకుల సొసైటీ పార్ట్‌టైమ్ ఉద్యోగుల వేతనాలను 3 నెలలుగా నిలిపేసింది. ఉత్తర్వులు జారీ చేసినా కూడా ఇప్పటికీ విడుదల చేయలేదు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని 268 ఆశ్రమ పాఠశాల్లో పనిచేస్తున్న 340 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లకు 5 నెలలుగా వేతనాలను చెల్లించడం లేదు. ట్రైబల్ గురుకుల సొసైటీలోని పార్ట్టైమర్లకూ జీతాలను నిలిపివేసింది. దీంతో చిరుద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. తమ సమస్యపై ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించాలని, వేతనాలను చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.