హైదరాబాద్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ): బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశంపై కోర్టు తీర్పు తర్వాతే పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సోమవారం క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్, పార్టీపరంగా ఇవ్వాలని నిర్ణయించామని, కేంద్ర ప్రభుత్వ సహకరించకపోవడం వల్ల ప్రభుత్వపరంగా రిజర్వేషన్ అమలు చేయలేకపోయామని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగిసే మార్చి 31లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే దాదాపు రూ.3వేల కోట్ల నిధుల కోల్పోతామని అందుకే పార్టీపరమైన రిజర్వేషన్లతో తొలుత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
ఆ తర్వాత కోర్టు తీర్పులను బట్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల అకాలమరణం చెందిన ప్రముఖ కవి అందెశ్రీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఆయన కుమారుడు దత్తసాయికి డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే అందెశ్రీ అంతిమ సంస్కారాలు నిర్వహించిన స్థలాన్ని స్మృతివనంగా ఏర్పాటుచేసే అంశంపై ఆలోచన చేస్తామని పేర్కొన్నారు. అందెశ్రీ రచించిన తెలంగాణ గీతాన్ని ప్రతి పాఠ్యపుస్తకంలో మొదటి పేజీలో ప్రింట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గిగ్ వర్కర్ల బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు చెప్పారు. ఎస్సారెస్పీ స్టేజ్-2 ప్రధాన కాలువకు మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరు పెట్టనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు. కాగా, ఈ నెల 25న మరోసారి క్యాబినెట్ సమావేశం కావాలని నిర్ణయించింది.