న్యూఢిల్లీ, జూలై 10: భారత్లో జారీ అవుతున్న ప్రతి రెండు మెడికల్ ప్రిస్క్రిప్షన్లలో (మందుల చీటీ) ఒకటి ప్రామాణిక మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంటున్నదని, దాదాపు పదో వంతు మందుల చీటీల్లో ‘ఆమోదయోగ్యం కాని తేడాలు’ కనిపిస్తున్నాయని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. 2019 ఆగస్టు నుంచి 2020 ఆగస్టు మధ్యకాలంలో ప్రామాణిక చికిత్సా మార్గదర్శకాలకు అనుగుణంగా వైద్యులు జారీ చేసిన 4,838 మందుల చీటీలను ఈ బృందం విశ్లేషించింది. పొట్టలో ఎసిడిటీని తగ్గించేందుకు ఉపయోగించే పాంటోప్రజోల్ ఔషధాన్ని వైద్యులు 54 ప్రిస్క్రిప్షన్లలో శరీరంపై బాధాకరమైన దద్దుర్లను కలిగించే వైరల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న రోగులకు సూచించారని ఎయిమ్స్ పరిశోధకుల బృందం గుర్తించింది. ‘పాన్ 40’ లాంటి పలు పేర్లతో దాదాపు అన్ని మందుల షాపుల్లో లభ్యమయ్యే ఈ మందును పారాసిటమాల్, ఆయింట్మెంట్లు సహా ఇతర ఔషధాలతో కలిపి సిఫారసు చేసినట్టు తేల్చింది. పాంటోప్రజోల్ను పెప్టిక్ అల్సర్ల ముప్పు ఉన్న రోగులకు మాత్రమే సిఫారసు చేయాలని, ఈ మందును రోగికి సిఫారసు చేస్తే ఇతర దుష్ప్రభావాలకు దారితీయవచ్చని స్పష్టం చేసింది.