హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): కొన్ని వేల ఏళ్ల క్రితమే పూర్వీకులు శాస్త్రీయ పద్ధతిలో పంచాంగం రూపొందించారని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. గ్రహాల కదలిక, అక్షాంశాలు, రేఖాంశాల ప్రాతిపదికన తిథి, వార, పర్వదినాలు, గ్రహణాల గురించి నాడే పంచాంగం ద్వారా తెలిపారని చెప్పారు.
యాదాద్రి-భువనగిరి జిల్లా నారాయణపురం మండలం జనగామకు చెందిన కొండోజు లక్ష్మీనరసింహాచారి సిద్ధాంతి రాసిన శోభకృత్ నామ సంవత్సర సనాతన ధర్మ పంచాంగాన్ని హైదరాబాద్ అకాడమీ కార్యాలయంలో గౌరీశంకర్ గురువారం ఆవిషరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంచాంగం అంటే జ్యోతిష్యం, జాతకం చెప్పడమో కాదని చెప్పారు. పంచాంగం వల్ల ప్రతి ఒక్కరికీ శుభం చేకూరుతుందని తెలిపారు. సనాతన ధర్మ పంచాగాన్ని వెలువరించిన లక్ష్మీనరసింహాచారి సిద్ధాంతిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురసార గ్రహీత డాక్టర్ రథం మదనాచార్యులు, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, సమాచార పౌరసంబంధాల శాఖ జేడీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.