హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : కార్మికులు తమ హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు అధ్యక్షతన సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. తొలుత ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరణించిన కార్మికులకు ప్రతినిధులు సంతాపం ప్రకటించారు. అనంతరం పల్లా మాట్లాడుతూ పోరాటాలతోపాటు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలని సూచించారు. కేసీఆర్ పాలనలోనే కార్మికులకు, ఉద్యోగులకు సముచిత న్యాయం జరిగిందని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా నాడు కార్మికులకు అనేక హామీలిచ్చిన రేవంత్రెడ్డి.. సీఎం అయ్యాక హామీలపై చేతులెత్తేశారని ధ్వజమెత్తారు. కార్మికుల పోరాటాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాలని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు రూప్సింగ్, నాయకులు నారాయణ, మారయ్య, దానకర్ణాచారి, నగేశ్యాదవ్, సంతోష, భారతి, కాశిరెడ్డి, సునీత, బాబాయమ్మ, నర్సింహులు, ప్రభాకర్, తిరుపతి, నిర్మలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.