స్టేషన్‌ఘన్‌పూర్, ఏప్రిల్ 17: ‘ఎమ్మెల్యేగా ఉన్నది లేదు.. నిధులు తెచ్చింది లేదు.. ఒక ఎకరానికి, ఒక చెరువుకు, ఒక కాల్వకు నీరు అందించింది లేదు.. మరి నువ్వు ఎలా దేవాదుల సృష్టికర్తవో చెప్పు’ అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కడియంను ప్రశ్నించారు. గురువారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో మండల అధ్యక్షుడు గణేశ్ అధ్యక్షతన, జఫర్‌గఢ్‌లోని ఆర్యవైశ్య భవన్లో నిర్వహించిన రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాజయ్యతోపాటు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2001 నుంచి 2004 వరకు టీడీపీ ప్రభుత్వంలో కడియం ఎమ్మెల్యేగా ఉండగా నాటి సీఎం చంద్రబాబు పనులకు శంకుస్థాపన చేసినా తట్టెడు మట్టి తీయలేదని గుర్తుచేశారు.
2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండగా, నాడు ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య 40వేల ఎకరాలకు సాగునీరు అందించారని, 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ దేవాదుల పథకాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేటాయించి, రూ.8వేల కోట్లతో 5లక్షల13వేల ఎకరాలకు సాగునీరు అందించినట్టు వివరించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, 2014 నుంచి 2023 వరకు రాజయ్య ఎమ్మెల్యేగా ఉంటే.. కడియం ఎవరి వద్ద నిధులు తెచ్చారని ప్రశ్నించారు.
దేవాదుల ఫేజ్-1లో 350, ఫేజ్ -2లో 550 క్యూసెక్కులకు, మూడో ఫేజ్‌లో 1800 క్యూసెక్కులకుగాను మూడు పంపుహౌజ్‌లను ఏర్పాటు చేయగా, అందులో కడియం పాత్ర ఎంత అని నిలదీశారు. ఏం చేశారని దేవన్నపేటలో మోటర్లు ఆన్ చేయడానికి వెళ్లారని, అసలు ఒక్క ఎకరానికైనా సాగునీరు అందించిన ముఖమేనా తనది? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ కండువా కప్పుకున్నాకే ప్రజలు ఆశీర్వదించారన్న విషయాన్ని మరిచిపోతే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు పెద్దసంఖ్యలో హాజరుకావాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.