జనగామ, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : ‘70 ఏండ్ల అన్యాయాన్ని పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సరిచేస్తే.. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసే ప్రయత్నంలో మళ్లీ ఆంధ్రుల కుట్రలు మొదలయ్యాయి.. రేవంత్రెడ్డి రెండున్నరేండ్ల పాలన విధ్వంసంతో సాగింది.. పండించడానికి కాదు.. పంట అమ్ముకోవడానికి అరిగోస పడుతున్న రైతుల వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే కొత్త డిస్కమ్పై మరో పోరాటానికి సిద్ధం కావాలి’ అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మంగళవారం జనగామలోని ఆర్టీసీ చౌరస్తా వద్ద జాతీయ జెండా, పార్టీ పతాకాలను ఆవిష్కరించిన అనంతరం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో లక్షలాది మందిని వెంట నడిపిస్తూ, శాంతియుతంగా ఉద్యమించి తెలంగాణను సాధించిన వీరుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ పదేండ్ల పాలనను ఊరూరా పార్టీలకతీతంగా తలుచుకుంటున్న ప్రజలు.. ‘కాంగ్రెస్ను నమ్మి మేం మోసపోయాం.. మాయమాటలకు ఓటేసి గోస పడుతున్నామనే ఆవేదనతో ఉన్నారు’ అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించి మరో రూపాన్ని పెట్టడం బాధాకరమని.. అందుకే తాను కాంగ్రెస్ ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి వెళ్లకుండా.. స్ఫూర్తినిచ్చిన అసలైన విగ్రహానికి పార్టీ కార్యాలయంలో నివాళులర్పించినట్టు చెప్పారు.